కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు 70వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబందించిన బర్త్ డే సీడీపీ ని విడుదల చేశారు. అది ట్రెండింగ్ అవుతుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుల్లో ఒకరు మోహన్‌బాబు (Mohanbabu). విలక్షణ నటనతో హీరోగా, విలన్‌గా మెప్పించారాయణ. కలెక్షన్ కింగ్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న మంచు మోహన్‌బాబు నాలుగున్నర దశాబ్దాలుగా సినీరంగంలో రాణిస్తున్నారు. హీరోగా, విలన్‌గానే కాదు, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగానూ రాణించారు. ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా కొనసాగుతున్నారు. ఇటీవల `సన్ ఆఫ్ ఇండియా` చిత్రంతో అలరించిన ఆయన రేపు(మార్చి 19) తన 70వ(Mohanbabu Birthday) పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు.
1952 మార్చి 19, చిత్తూరి జిల్లా మోధుగులపాలెంలో జన్మించారు మోహన్‌బాబు. ఆయన అసలు పేరు భక్తవత్సలం నాయుడు. సినిమాల్లోకి వచ్చాక మోహన్‌బాబుగా మార్చుకున్నారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోహన్‌బాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలబడ్డాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఓ చెట్టులా ఎదిగారు. ఎందరికో జీవితాలనిచ్చారు. నిర్మాత, నటుడిగా ఎంతో మంది కొత్త దర్శకులకు, హీరోయిన్లకి, నటులకు ఆయన తన సినిమాలతో లైఫ్ ఇచ్చారు. మరోవైపు విద్యావేత్తగా తన విద్యానికేతన్ విద్యాసంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
ఈ పుట్టిన రోజు మోహన్‌బాబు జీవితంలో చాలా స్పెషల్. ఏడుపదుల వయసులోకి అడుగుపెడుతుండటం ఓ విశేషమైతే, ఇటీవల ఆయన తన మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయు)ని స్థాపించడం మరో విశేషం. విద్యావేత్తగా నెక్ట్స్ లెవల్‌కి చేరుకున్నారు. తన యూనివర్సిటీ ద్వారా విద్యా ప్రదానంలో మరో ముందడుగు వేశారు. అయితే సినీ రంగానికి తన వంతు సహాయం అందిస్తామని తెలిపారు మోహన్‌బాబు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఆయన చెబుతూ, సినీ రంగంలోని 24 క్రాఫ్ట్ లకు చెందిన వారు ఎవరైనా తమ పిల్లలు ఎంబీ యూనివర్సిటీలో ఉన్నత విద్యాని అభ్యసించాలనుకుంటే వారికి ప్రత్యేకంగా ఫీజ్ కన్సేషన్ ఇస్తానని వెల్లడించారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోహన్‌బాబు తెలిపారు.

మరోవైపు నటుడిగా మోహన్‌బాబు బర్త్ డే సీడీపీని విడుదల చేశారు మోహన్‌బాబు టీమ్. ఆయన నటించిన `రాయలసీమ రామన్నచౌదరి` చిత్రంలోని లుక్ ప్రధానంగా ఈ బర్త్ డే సీడీపీని డిజైన్ చేశారు. ఇందులో ఆయన కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్ చిత్రాల పేర్లు, వాటిలోని మోహన్‌బాబు లుక్స్ ని పంచుకుంది. తాజాగా ఈ బర్త్ డే సీడీపీ వైరల్ అవుతుంది. నటుడిగా మోహన్‌బాబు 500లకుపైగా చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `శాకుంతలం` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
