`శాకుంతలం` నుంచి మోహన్‌బాబు ఫస్ట్ లుక్ ఔట్.. పాత్రేంటంటే?
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రస్తుతం `శాకుంతలం` చిత్రంలో నటిస్తున్నారు. సమంత మెయిన్ లీడ్ గా చేస్తున్న సినిమా ఇది. ఇందులో ఆయన పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్.

సమంత ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం `శాకుంతలం`. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దేవ్ మోహన్, మోహన్‌బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా కనిపించబోతుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. వచ్చే నెలలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరు పెంచారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
మోహన్‌బాబు ఈ చిత్రంలో దుర్వాస మహర్షి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. మహర్షిగా ఆయన లుక్ అదిరిపోయేలా ఉంది. ఆయన తన ఏజ్‌కి తగ్గ పాత్రలో కనిపించబోతున్నారని చెప్పొచ్చు. లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మరో రెండు రోజులో(మార్చి 19) మోహన్‌బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా రెండు రోజుల ముందే ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేయడం విశేషం.
ఇందులో మోహన్‌బాబు నటిస్తున్న దుర్వాస మహర్షి పాత్ర కీలకంగా ఉండబోతుంది. అత్రి మహర్షి, అనసూయల కుమారుడు దుర్వాస మహర్షి. పురాణాల ప్రకారం ఆయన అత్యంత కోపిష్టిగా ప్రసిద్ధి. ఆయనకు కోపం వస్తే శపిస్తుంటారు. ఆయన శాపానికి గురైన వాళ్లు జీవితాంతం దానితో బాధపడాల్సి వస్తుంది. అందుకే ఆయన్ని భక్తి శ్రద్ధాలతో పూజిస్తారు. అతి మర్యాదలతో ముంచెత్తుతారు.
అలాంటి ముక్కోపి అయిన దుర్వాస మహర్షి కోపానికి శకుంతల గురవుతుంది. మరి శకుంతలపై మహర్షి కోపానికి కారణమేంటి? ఆ శాపానికి విముక్తి ఏంటి? ఆయన పాత్ర ఎలాంటి మలుపులు తిప్పిందనేది `శాకుంతలం` చిత్రంలో ముఖ్య భాగంగా ఉండబోతుంది. ఇదే సినిమాకి కీలకం కాబోతుందని సమాచారం. ఇక శకుంతల, దుష్యంత్ ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, గుణా టీమ్ వర్క్ పతాకాలపై దిల్‌రాజు, నిలిమా గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమాని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు దర్శకుడు గుణశేఖర్. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. విడుదలైన పాటలు వినసొంపుగా, అద్భుతంగా ఉన్నాయి. విజువల్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారు.