మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..అభినందనలు తెలిపిన పవన్, బాలకృష్ణ
దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.
దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇండియాలో నటులకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు ఇదే.
మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. మిథున్ చక్రవర్తిని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసినట్లు అనౌన్స్ చేశారు. ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతున్న మిథున్ చక్రవర్తికి కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. 'మిథున్ చక్రవర్తి అద్భుత సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకి అందించాలని జ్యూరీ సభ్యులు నిర్ణయించారు అని మంత్రి పోస్ట్ చేశారు.
జాతీయ అవార్డులు అందుకున్న మిథున్ చక్రవర్తి
మిథున్ చంద్రవర్తి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మిథున్ చక్రవర్తి 1950 జూన్ 16న కలకత్తాలో జన్మించారు. 1976లో ఆయన మృగాయ అనే చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లో ఆయన కెరీర్ ఘనంగా ప్రారంభం అయింది. తొలి చిత్రంతోనే మిథున్ చంద్రవర్తి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. 1993లో మరోసారి ఆయనకి జాతీయ అవార్డు దక్కింది. తహడెర్ కథ అనే చిత్రానికి మిథున్ చక్రవర్తి జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. తన కెరీర్ లో మిథున్ చక్రవర్తి ఎక్కువగా హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించారు.
అగ్నిపథ్, జల్లాడ్ చిత్రాలకి గాను ఆయన ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కూడా ఆయన ఫిలిం ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇప్పుడు ఈ లెజెండ్రీ యాక్టర్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఆయనకి దక్కిన గౌరవంగా భావించవచ్చు. తన కెరీర్ లో మిథున్ చక్రవర్తి కొన్ని వందల చిత్రాల్లో నటించారు.
ఈ ఏడాది ఆరంభంలో మిథున్ చక్రవర్తి పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. కాగా తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన రావడం మరో గుడ్ న్యూస్. మిథున్ చంద్రవర్తికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంతో సెలెబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిథున్ చంద్రవర్తికి శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు శ్రీ మిథున్ చక్రవర్తి గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించింది. శ్రీ మిథున్ చక్రవర్తి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయి.
‘ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్...’ అనే పాటను ఎవరూ మరచిపోలేరు. హిందీ చిత్రసీమలో శ్రీ అమితాబ్ బచ్చన్ గారి తరవాత అంత క్రేజ్ దక్కించుకున్న కథానాయకుడు శ్రీ మిథున్ చక్రవర్తి గారు. నేను నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగిన ఆయన తర్వాత కాలంలో టీఎంసీ, అటు పిమ్మట బీజేపీలో చేరారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న శ్రీ మిథున్ చక్రవర్తి గారికి భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
బాలకృష్ణ రెస్పాన్స్ ఇలా..
అదే విధంగా నందమూరి బాలకృష్ణ కూడా మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై స్పందించారు. విలక్షణ నటుడు, మిత్రుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయం! తొలి చిత్రం 'మృగయా'తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు మిథున్ చక్రవర్తి. ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తరువాత బాలీవుడ్ కమర్షియల్ మూవీస్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు మిథున్. ముఖ్యంగా 'డిస్కో డాన్స్'కు మిథున్ చక్రవర్తి విశేషమైన పేరు సంపాదించి పెట్టారు.
మిథున్ చక్రవర్తితో నాకు చిత్రబంధం ఉంది- అదెలాగంటే నేను సోలో హీరోగా బయటి సంస్థల చిత్రాలలో నటించడానికి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం 'డిస్కో కింగ్'. ఈ చిత్రానికి మిథున్ చక్రవర్తి హిందీ సినిమా 'డిస్కో డాన్సర్' ఆధారం. అలా మా ఇద్దరికీ చిత్ర బంధం ఉంది.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమమైన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డుకు ఎంపికై మిథున్ చక్రవర్తికి నా హృదయపూర్వక శుభాభినందనలు. మిథున్ నటునిగా మరెన్నో విలక్షణమైన పాత్రలలో మురిపిస్తూ సాగాలని ఆశిస్తున్నాను అని బాలయ్య తెలిపారు.