మిరాయ్ సినిమా శుక్రవారం విడుదలై ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతుంది. హనుమాన్ రికార్డులు బ్రేక్ చేసింది.
బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న `మిరాయ్` వసూళ్లు
తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `మిరాయ్`(Mirai) బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజు వసూళ్లు అతని గత సినిమా 'హనుమాన్' ఓపెనింగ్ కలెక్షన్స్ (పెయిడ్ ప్రివ్యూలు తీసేస్తే) కంటే ఎక్కువగా వచ్చాయి. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 12న శుక్రవారం థియేటర్లలో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సోషల్ మీడియాలో కూడా సినిమాకి మంచి టాక్ వచ్చింది. అందుకే నైట్ షోల ఆక్యుపెన్సీ మార్నింగ్ షోల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా విడుదలైంది. మార్నింగ్ షోల ఆక్యుపెన్సీ 5.55% ఉండగా, నైట్ షోలకి అది 17%కి పెరిగింది.
'మిరాయ్' మొదటి రోజు ఎంత వసూలు చేసింది?
sacnilk.com వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం 'మిరాయ్: సూపర్ యోధ' సుమారు రూ.12 కోట్లు వసూలు చేసింది. తేజ సజ్జ గత సినిమా 'హనుమాన్'తో పోలిస్తే, దానికంటే దాదాపు రూ.4 కోట్లు ఎక్కువ వసూలు చేసింది. 2024లో విడుదలైన 'హనుమాన్' ఫస్ట్ డే 8.05 కోట్లు వసూలు చేసింది. అయితే, ‘హనుమాన్’ రిలీజ్‌కి ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. దాని ద్వారా రూ.4.15 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్లు రూ.12.2 కోట్లుగా లెక్కించారు.
తేజ సజ్జా టాప్ 5 ఓపెనింగ్ మూవీస్
| నెం. | సినిమా | రిలీజ్ సంవత్సరం | ఓపెనింగ్ కలెక్షన్స్ |
| 1 | హనుమాన్ | 2024 | 12.2 కోట్లు (పెయిడ్ ప్రివ్యూతో సహా) |
| 2 | మిరాయ్ | 2025 | 12 కోట్లు |
| 3 | ఓ బేబీ | 2019 | 2.50 కోట్లు |
| 4 | జోంబీ రెడీ | 2021 | 1.51 కోట్లు |
| 5 | ఇష్క్ | 2021 | 0.22 కోట్లు |
తేజ సజ్జా 'మిరాయ్' బడ్జెట్ ఎంత?
రిపోర్టుల ప్రకారం, తేజ సజ్జ 'మిరాయ్' సినిమా బడ్జెట్ దాదాపు రూ.60 కోట్లు. దీన్ని బట్టి చూస్తే, మొదటి రోజే సినిమా 20% వసూలు చేసింది. సినిమా నిర్మాతలు కృతి ప్రసాద్, టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు. హిందీలో ఈ సినిమాని కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేసింది. 'మిరాయ్'లో తేజ సజ్జతో పాటు మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరన్, జయరాం, జగపతిబాబు, రాజేంద్రనాథ్ జుట్షి, పవన్ చోప్రా, తాన్య కెల్లర్ వంటి నటులు కూడా నటించారు.
`మిరాయ్` కథేంటంటే?
అశోకుడు కళింగ యుద్ధంలో గెలుస్తాడు, కానీ సర్వస్వం కోల్పోతాడు. దీంతో తన శక్తిని తొమ్మిది గ్రంథాల్లోకి పంపిస్తాడు. ఆ తొమ్మిది గ్రంథాలు యోధులకు రక్షించే బాధ్యతలు అప్పగిస్తాడు. కానీ ఆ గ్రంథాలపై అసురుడు మహావీర్ కన్నుపడుతుంది. వాటి శక్తిని తీసుకుని అమరత్వం పొందాలనుకుంటాడు. దాన్ని వేద(తేజ సజ్జా) అడ్డుకునే ప్రయత్నమే `మిరాయ్` మూవీ కథ. ప్రస్తుతానికి, మైథలాజీ, ఫిక్షన్, జోడించి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
