Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వం జోక్యం వరకు తెచ్చుకోవద్దుః సినీ కార్మికుల సమ్మెపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని..

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు బుధవారం ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈనేపథ్యంలో దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు.

minister talasani srinivas yadav react on telugu film federation workers strike
Author
Hyderabad, First Published Jun 22, 2022, 4:38 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో సమ్మె సైరన్‌ మోగింది. నేడు(బుధవారం) పరిశ్రమకి సంబంధించిన 24 క్రాఫ్ట్ ల వారు సమ్మెలోకిదిగారు. దీంతో షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. గత రెండు కొన్ని రోజులుగా తమకు వేతనాలు పెంచాలని కార్మికుల సంఘాలకు చెందిన ఫిల్మ్ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేస్తుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వేతనాలు పెంచలేదు. ఆ సమయంలో షూటింగ్లు సరిగా జరగలేదు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు పరిశ్రమ కోలుకుని సినిమాలు బాగా ఆడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వేతనాలు పెంచాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్టు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. 

బుధవారం ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులంతా ఆందోళనలో పాల్గొనడంతో ఈ రోజు హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్న దాదాపు 20 సినిమాల చిత్రీకరణలు ఆగిపోయాయి. ఇందులో తెలుగుతోపాటు, తమిళం, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. సినీ కార్మికుల డిమాండ్స్ ని కూర్చొని పరిష్కరించుకోవాలని తెలిపారు. కరోనా కారణంగా చాలా ఇబ్బంది పడ్డ కార్మికులను ఫిల్మ్ ఛాంబర్‌, నిర్మాతల మండలి చర్చలకు పిలవాలని ఆదేశించారు. ప్రభుత్వం జోక్యం చేసుకునేంత వరకు పరిస్థితి తీసుకురావద్దని చెప్పారు. లేబర్‌ డిపార్ట్ మెంట్‌కి కూడా సమ్మెకి సంబంధించిన లేఖ ఇవ్వలేదని, రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. 

దీనిపై తాజాగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్‌ స్పందించారు. సినీ కార్మికుల నిర్ణయం వల్ల నేడు చిత్రపరిశ్రమ చాలా నష్టపోయిందన్నారు. జూన్‌ 6న తమకు ఫెడరేషన్‌నుంచి లేఖ వచ్చిందని, కానీ దానికంటే ముందే కార్మికుల వేతనాలపై ఫిల్మ్ ఛాంబర్‌ ఆలోచిస్తుందన్నారు. ఇంతలోనే ఫిల్మ్ ఫెడరేషన్‌ సమ్మె చేయాలని నిర్ణయించుకోవడం సరైనది కాదు, ఇది చాలా తప్పు అని, షూటింగ్ లు ఆపడానికి వీలు లేదని, రేపటి నుంచి యథావిధిగా కార్మికులు షూటింగ్‌లకు హాజరు కావాలని తెలిపారు సి. కళ్యాణ్‌. 

ఇంకా ఆయన చెబుతూ, కార్మికుల జీతాలకు సంబంధించి విధి విధానాలు రూపకల్పన చేస్తామని, అందుకు కార్మికులకు ఐదు కండీషన్స్ పెడుతున్నట్టు తెలిపారు. 1. నిర్మాతలపై ఒత్తిడి చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలి. 2. సినీ కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దు. 3. అందరం కలిసి షూటింగ్స్‌ జరుపుకుందాం. 4. ఎల్లుండి వేతనాలపై చర్చిస్తాం. 5. ఏ కార్మికుడి కడుపు కొట్టాలని నిర్మాత చూడడు. కార్మికులందరికి వేతనాలు పెంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ సినిమా కార్మికులు హాజరుకాకపోతే తామే షూటింగ్ లు ఆపేస్తాం. 2018లో వేతనాలపై ఒప్పందం చేసుకున్నాం. ఫిలిం ఫెడరేషన్ నాయకులు కార్మికుల పొట్టకొట్టొద్దు` అని చెప్పారు నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్‌.

Follow Us:
Download App:
  • android
  • ios