తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఆసక్తికర ప్రకటన చేశారు. తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇళయరాజా సమక్షంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.
తెలంగాణ రాష్ట్రలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఆయన తాజాగా శ్రియా ప్రధాన పాత్రలో నటించిన `మ్యూజిక్ స్కూల్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఈవెంట్‌కి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఇళయరాజా సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మ్యూజికల్ యూనివర్సిటీలాంటి ఇళయరాజా తో కలిసి ఈ వేదికని పంచుకోవడం గౌరవంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా తాను గెస్ట్ గా మాత్రమే ఈ ఈవెంట్‌కి రాలేదని, ఓ ఎజెండాతో వచ్చానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇళయరాజాగారి సారథ్యంలో ఆయన లీడ్‌గా మ్యూజిక్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నామని తెలిపారు. కేటీఆర్ ప్రకటన ఇళయరాజా సైతం ఆశ్చర్యపోయారు. తాను అందుకు సిద్ధమే అనే సంకేతాలిచ్చారు. కేటీఆర్ ప్రకటనతో ఆడియెన్స్ తోపాటు వేదికపై ఉన్న సినిమా ప్రముఖులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ, చిత్ర దర్శకుడు పాపారావు తనకు చాలా కాలంగా తెలుసు అని, ఆయన గొప్ప ఆఫీసర్ అని, ఎన్నో మంచి పనులు చేశారని తెలిపారు. ఆయనతో అనుబంధం మర్చిపోలేనిదని వెల్లడించారు. అయితే పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు చేయాలని పేరెంట్స్ భావిస్తుంటారు. తమ ఆలోచనలను వారిపై రుద్దుతుంటారు. కానీ పిల్లల క్రియేటివిటీకి అవకాశం ఇవ్వరు. అలాంటి క్రియేటివ్ సైడ్ కూడా ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారని తెలిపారు.
తన కుమారుడికి ఇప్పుడు 17ఏళ్లు. ఆ మధ్య తనే సొంతంగా ఓ కవర్ సాంగ్ చేశాడు. అది తనకు చూపించాడని, తనలో ఇలాంటి టాలెంట్ ఉందా? అని ఆశ్చర్యపోయారు. ఇలా ప్రతి ఒక్కరిలో హిడెన్ టాలెంట్ ఉంటుంది. దాన్ని ప్రోత్సహించాలని తెలిపారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఇళయరాజాతోపాటు హీరోయిన్ శ్రీయా, నిర్మాత దిల్‌రాజు, ఇతర చిత్ర బృందం పాల్గొంది. శ్రియా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పాపారావు దర్శకత్వం వహించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం.. అధికారంలో వచ్చినప్పట్నుంచి చిత్ర పరిశ్రమకి చాలా చేయాలని ప్రకటించారు. రాచకొండ గుంటల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు అప్ డేట్ లేదు. నంది అవార్డులను సింహా అవార్డులుగా ఇస్తామన్నారు. అది లేదు. మరి మ్యూజిక్ యూనివర్సిటీ సాధ్యమా? అనేది చిత్ర వర్గాలను తొలుస్తున్న ప్రశ్న.
