`మొగలిరేకులు` సీరియల్‌ చూస్తే మా పనిమనిషీ టీ పెట్టడానికి కూడా వచ్చేది కాదు అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. అప్పట్లో చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లమని తెలిపారు. 

`మొగలిరేకులు` సీరియల్‌ అప్పట్లో ఎంతటి పాపులరో తెలిసిందే. బుల్లితెర ఆడియెన్స్ ని బాగా కట్టిపడేసిన సీరియల్‌ ఇది. ఆడవాళ్లే కాదు, ఇంటిళ్లిపాది చూసే సీరియళ్ల జాబితాలో ఇదొకటి. ఇందులో ఆర్కే నాయుడిగా పాపులర్‌ అయ్యారు నటుడు సాగర్‌. 

లీడ్‌ రోల్‌ చేసి మెప్పించారు. అంతేకాదు నెగటివ్‌ రోల్లోనూ మెప్పించారు. ఈ సీరియల్‌తో ఆయన ఓ రకంగా బుల్లితెర సూపర్‌ స్టార్‌గా రాణించారు. ఆ సీరియల్‌ తెచ్చిన పాపులారిటీతో సినిమాల్లోకి వచ్చారు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు `ది 100` పేరుతో సినిమా చేశారు.

`ది 100` సినిమాతో ఆడియెన్స్ ముందుకొస్తున్న సాగర్‌

`ది 100` మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి గెస్ట్ గా రావాల్సింది. కానీ రాలేకపోయారు. 

ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హాజరయ్యారు. ఇందులో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

చిన్నప్పట్నుంచి చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లమని, ఈ వేడుకలో దర్శకుడు కోదండరామిరెడ్డి రావడంతో అప్పటి చిరంజీవి సినిమాలు చూసిన రోజులు గుర్తుకొచ్చాయని తెలిపారు.

`మొగలి రేకులు` సీరియల్‌ చూస్తే మా పనిమనిషీ టీ పెట్టడానికి రాలే

సాగర్‌ గురించి చెబుతూ, మంత్రి శ్రీధర్‌ బాబు ఈ ఫంక్షన్‌ గురించి చెప్పినప్పుడు `మొగలిరేకులు` నటుడు అని చెప్పగానే వెంటనే వస్తా అని తెలిపాను. ఎందుకంటే `మొగలిరేకులు` సీరియల్‌ ని మా ఇంట్లో ఆడవాళ్లంతా టీవీలకు అతుక్కుపోయి చూసేవారు. 

నేను బయట నుంచి ఇంట్లోకి వచ్చి టీ పెట్టమని అడిగినా ఎవరూ వచ్చేవారు కాదు. మా పనిమనిషి కింద ఉండేది, ఆమెని టీ పెట్టాలని పిలిచినా `మొగలిరేకులు` సీరియల్‌ వస్తుందని, అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పేది. 

ఇక చేసేదేం లేక మా వైఫ్‌ని బతిమాలుకుని టీ పెట్టించుకునేవాడిని, అలా ఈ సీరియల్‌ గురించి తెలిసింది` అని అన్నారు మంత్రి కోమటి రెడ్డి.

సందేశాత్మక మూవీ `ది 100`

సాగర్‌ ఈ చిత్రంతో హీరోగా ఆడియెన్స్ ముందుకు రాబోతుండటం ఆనందంగా ఉందన్నారు మంత్రి. `మంచి మెసేజ్ తో ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలకు ధన్యవాదాలు. రైట్ టైం లో రైట్ సినిమా ఇది. 

ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే సినిమా ఫస్ట్ డే చూడాలని నిర్ణయించుకున్నాను. సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఉన్న ఈ సినిమా సమాజానికి చాలా ముఖ్యం. సాగర్ చాలా అద్భుతమైన నటుడు. ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు వుంది. 

సొంత టాలెంట్ తో గొప్ప స్థాయికి ఎదిగారు. భవిష్యత్తులో తను చాలా గొప్ప హీరో అవుతారు. ఈ సంవత్సరం బెస్ట్ ఫిలిమ్ గా `ది 100` సినిమా వస్తుంది అని చెప్పడంలో డౌట్ లేదు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. 

ఈ సినిమాని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా చూసి మెచ్చుకున్నారంటే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. సాగర్ కి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది. 

ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో సాగర్ అద్భుతంగా ఫిట్ అయ్యాడు.సాగర్ ఫ్యూచర్ హీరో అఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్` అని అన్నారు.

పైరసీని అరికడతాం 

పైరసీని అరికట్టేందుకు తమవంతు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే ఇటీవల కొందరిని అరెస్ట్ చేశామని, పోలీస్‌ వ్యవస్థ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉందని తెలిపారు మంత్రి.

 మంచి సందేశాలను అందించాలని, వినోదం అందించాలని చాలా మంది నిర్మాతలు కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. కానీ పైరసీతో పేరుతో సినిమాలను చంపేస్తున్నారు. అలాంటి వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి.

సొంతంగా ఎదిగిన హీరో సాగర్‌ః మంత్రి శ్రీధర్‌ బాబు

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమా చూశా. చాలా అద్భుతంగా ఉంది. పవర్ ఫుల్ యాక్టింగ్ ద్వారా గొప్ప మెసేజ్ అందించారు. సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. మా ప్రాంత వాసి. సొంతగా ఎదిగి ఇంత దూరం వచ్చాడు. 

`మొగలిరేకుల`తో చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. తను చాలా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈ సినిమా ఒక పవర్ఫుల్ వెపన్ లా ఉంటుంది. 

చాలా మంచి కథ ఫ్యామిలీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ధైర్యాన్ని సాహసాన్నిచ్చే సినిమా. సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలకి సమాధానం దొరికే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం` అని అన్నారు.

అంజనమ్మ, పవన్‌ సహాయం మర్చిపోలేనుః నటుడు సాగర్‌

హీరో సాగర్ మాట్లాడుతూ, `అంజనమ్మ గారు నా సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. సజ్జనార్ గారు, నాగబాబు గారు అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. 

పవన్ కళ్యాణ్ ట్రైలర్ ని లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వారందరికీ ధన్యవాదాలు. ఐటి మినిస్టర్ శ్రీధర్ అన్నతో నాకు చాలా మంచి బాండ్ ఉంది. 

ఆయన సినిమా చూసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి కోమటిరెడ్డి గారికి థాంక్యూ. మమ్మల్ని బ్లెస్ చేయడానికి రావడం చాలా ఆనందంగా ఉంది.

ఈ యుగానికి వెపన్‌ లాంటి మూవీ `ది 100`

మా నిర్మాతల సపోర్ట్ ని మర్చిపోలేను. డైరెక్టర్ శశి చాలా ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో అయినా మంచి పొజిషన్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. 

ఈ సినిమాకి పనిచేసిన అందరూ కూడా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఈ సినిమా ఒక వెపన్. ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది.

త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100. ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమాకి అంత పవర్ ఉంది. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి` అని అన్నారు.