అవును ...ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న ‘మీటూ’  ఉద్యమం చాలా మందిని రోడ్డు మీదకు లాక్కొస్తే...నటుడు దగ్గుబాటి రానాకు మాత్రం కలిసి వచ్చేలా చేసింది. ‘మీటూ’తో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తాము చేస్తున్న సినిమాల నుంచి కొందరు తప్పుకునే పరిస్దితి వస్తోంది. మరికొందరిని వేరే దారి లేక చిత్ర యూనిట్ తొలగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఆఫర్స్ వేరే వారికి వెళ్తున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘హౌస్‌ఫుల్‌–4’ సినిమాలో నటిస్తున్న నానా పటేకర్, చిత్ర దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దాంతో  తప్పనిసరి పరిస్దితుల్లో  వీరిద్దరూ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. డైరక్టర్, మెయిన్ ఆర్టిస్ట్ లేకుండా షూటింగ్ కష్టం కాబట్టి... కొద్ది రోజులు బ్రేక్‌ పడింది. అయితే అలాగని ఎన్ని రోజులు షూటింగ్ ని ఆపగలరు. కోట్లాది డబ్బులతో కూడి ఉన్న వ్యవహారం. ఫైనాన్స్ లు తెచ్చి సినిమాలు చేసే బాలీవుడ్ లో ఒక రోజు షూటింగ్ కు బ్రేక్ పడినా కోట్లలో లాస్ వస్తుంది. 

ఇవన్నీ ఆలోచించి... ఈ వివాదం తేలి నానా పటేకర్, సాజిద్‌ ఖాన్‌లు నిర్దోషులుగా బయిటకు వచ్చేదాకా ఆగలేం అని...వారి  స్థానాలను వేరే వారితో భర్తీ చేసి త్వరలో ఈ సినిమా షూటింగ్‌ మొదలు పెట్టనున్నారు. 

అందులో భాగంగా డైరక్టర్ సాజిద్‌ ఖాన్‌ స్థానంలో దర్శకుడిగా ఫర్హాద్‌ సంజనీని తీసుకున్నారట. నానా పటేకర్‌ స్థానంలో టాలీవుడ్‌ హీరో రానాను తీసుకోనున్నారని బాలీవుడ్‌ టాక్‌. నానా స్థానంలో జాకీ ష్రాఫ్, అనిల్‌ కపూర్‌ల పేర్లు వినిపించాయి. 

తాజాగా రానా పేరు తెరపైకి వచ్చింది. చిత్ర వర్గాలు రానాతో సంప్రదింపులు జరుపుతున్నారని వినపడుతోంది.  అంత ప్రతిష్టాత్మకమైన సినిమాలో ఆఫర్ రావటం అంటే మాటలు కాదు..అందుకే రానా కూడా సముఖంగా ఉన్నట్లు చెప్తున్నారు. రానాకు మీటూ ఆ విధంగా కలిసి వచ్చింది.