'కృష్ణగాడి వీరప్రేమ గాథ' అనే హిట్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కి ఆ తరువాత అవకాశాలు బాగానే వచ్చాయి కానీ విజయాలు మాత్రం దక్కలేదు. మధ్యలో ఒకటీ అరా సక్సెస్ లు వచ్చినా.. ఆమెని టాప్ రేంజ్ లో నిలబెట్టలేకపోయాయి. దీంతో తన సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది.

రిజ్వాన్ ఫిల్మ్ సంస్థ సుధీర్ బాబుతో ఓ సినిమా చేయాలనుకుంది. ఇందులో హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకున్నారు. రూ.30 లక్షలు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. కానీ ఆ సినిమా నుండి సుధీర్ బాబు తప్పుకున్నాడు. దీంతో సుధీర్ బాబు స్థానంలోకి మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ వచ్చి చేరాడు.

హీరోయిన్ గా మెహ్రీన్ నే ఉంచాలని భావిస్తున్నారు మేకర్స్. కానీ దానికి ఆమె మాత్రం అంగీకరించడం లేదట. కళ్యాణ్ దేవ్ పక్కన నేను చేయనని మొరాయిస్తుందట. సుధీర్ బాబు హీరో అని చెప్పి ఇప్పుడు హీరోని మార్చి నటించమంటే ఎలా అంటూ నిర్మాతలతో గొడవకి దిగిందట. అలా అని అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిందా అంటే అదీ లేదు.

సుధీర్ పక్కన చేయను, అడ్వాన్స్ తిరిగివ్వను అంటూ రచ్చ చేస్తుందట. ఆమెతో రాజీ ప్రయత్నాలు చేసినా.. కుదరడం లేదట. కళ్యాణ్ పక్కన నటిస్తే ఎక్కువ పారితోషికం ఇస్తామని చెప్పినా.. వినడం లేదట. ఈ గొడవల ఫిల్మ్ ఛాంబర్ వరకూ వెళ్లిందని సమాచారం. మరి నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!