ప్రముఖ సినీ పాత్రికేయుడు, నటుడు టీఎన్నార్ కరోనాతో మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు టాలీవుడ్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి రూ.లక్ష సాయాన్ని టీఎన్ఆర్ భార్య జ్యోతికి అందజేశారు. టీఎన్ఆర్ మరణవార్త తెలుసుకున్న చిరంజీవి దిగ్బ్రాంతికి గురయ్యారు.

మంగళవారం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. అనంతరం తన వంతుగా లక్షరూపాయలను తక్షణ ఖర్చుల కోసం అందజేశారు. టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం ఎంతో ఆకట్టుకునేదని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మెగాస్టార్ తెలిపారు. టీఎన్ఆర్ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని చిరంజీవీ హామీ ఇచ్చారు.

Also Read:టాలీవుడ్‌కి బిగ్‌ షాక్‌ః నాని, విజయ్‌ దేవరకొండ, మంచు విష్ణు, సందీప్‌ కిష్‌ ప్రముఖుల సంతాపం

ఈ సందర్భంగా టీఎన్ఆర్ భార్య జ్యోతి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో తన భర్త సినీ రంగంలో అడుగుపెట్టారని ఆమె చెప్పారు. మీరంటే ఆయనకు అభిమానమని.. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారని టీఎన్ఆర్ భార్య చిరంజీవితో అన్నారు. ఆయన జీవితంలో ఇంతవరకు మిమ్మల్ని కలవలేదని.. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించిందని జ్యోతి చెప్పారు. 

నటుడు సంపూర్ణేశ్ బాబు సైతం టీఎన్ఆర్ కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. ఆయన భార్య జ్యోతి బ్యాంకు ఖాతాలో తాను రూ.50 వేలు జమ చేసినట్టు సంపూర్ణేశ్ వెల్లడించారు. టీఎన్నార్ ఇంటర్వ్యూ ద్వారా తాను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు పైకి ఎదిగానని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఆయన కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, తనవంతు సాయం తప్పకుండా చేస్తానని సంపూర్ణేష్ బాబు మాటిచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు ఇతరులు కూడా టీఎన్నార్ కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. తన ట్వీట్‌లో టీఎన్నార్ భార్య జ్యోతి బ్యాంకు ఖాతా నెంబరు, తదితర వివరాలను సంపూర్ణేష్ బాబు షేర్ చేశారు.