మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ

చాలా కాలం త‌ర్వాత మీ సినిమా ఫంక్ష‌న్ జ‌రిగింది. మీరు గ‌తంతో పోలిస్తే తేడా ఏమిటి..?

గ‌తంలో ఏదైనా ఫంక్ష‌న్ చేస్తే వేల‌ల్లో వ‌చ్చేవారు. ఇప్పుడు ఫంక్ష‌న్ అంటే ల‌క్ష‌ల్లో వ‌స్తున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి పోలీసుల లెక్క‌ల ప్ర‌కారం రెండు ల‌క్ష‌ల‌కు పైగా జ‌నం వ‌చ్చార‌ని తెలిసింది. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత నా సినిమా ఫంక్ష‌న్ జ‌ర‌గ‌డం చాలా హ్యాపీగా అనిపించింది.

నాగేశ్వ‌ర‌రావు గారితో న‌టించిన శ్రీదేవి ఆత‌ర్వాత నాగార్జున‌తో న‌టించింది. కానీ...మీ విష‌యంలో రివ‌ర్స్ అయ్యింది. కాజ‌ల్ చ‌ర‌ణ్ తో ఫ‌స్ట్ న‌టించి ఆత‌ర్వాత మీతో న‌టించింది మీరేమంటారు..?

అవును...! ఇలా జ‌ర‌గ‌డం చాలా అరుదు. మా పెయిర్ చూడ‌్డానికి బాగుంది అన్నారు.

మీ 150వ సినిమాకి రీమేక్ ని ఎంచుకోవ‌డానికి కార‌ణం..?

స్ట్రెయిట్ స్టోరీతో సినిమా చేయాలని క‌థ‌లు కోసం వెయిట్ చేసాను. అందులో సోష‌ల్ మెసేజ్ ఉండాలి అనుకున్నాను. ఠాగూర్, స్టాలిన్ త‌ర‌హాలో ఉండే సినిమా చేయాలి అనుకున్నాను. ఆ టైమ్ లో త‌మిళ మూవీ క‌త్తి చూసాను. నాకు సంతృప్తిక‌రంగా అనిపించింది. ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అనిపించింది చేసాను.

ఈ టైమ్ లోనే 150వ సినిమా చేయాలి అని ముందుగా అనుకున్నారా..?

ఈ టైమ్ లోనే చేయాలి అని ముందుగా ఏమీ అనుకోలేదు. రాజ‌కీయంగా స్ధ‌బ్ధ‌త ఉన్న టైమ్ లో సినిమాలోకి రమ్మ‌ని మిత్రులు, శ్రేయోభిలాషులు అన‌డం...ముఖ్యంగా అమితాబ్, ర‌జ‌నీకాంత్ లు కూడా న‌న్ను సినిమా చేయ‌మ‌న్నారు. అందరూ ఇంత‌లా చెబుతుంటే ఎందుకు చేయ‌కూడ‌దు అనిపించింది.

9 సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత న‌టించారు క‌దా..! ఫ‌స్ట్ డే షూటింగ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది..?

శంక‌ర్ దాదా జిందాబాద్ త‌ర్వాత నేను హీరోగా చేసిన సినిమా ఇది. అప్ప‌టికీ ఇప్ప‌టికీ షూటింగ్ విష‌యంలో పెద్ద‌గా తేడా ఏమీ క‌నిపించ‌లేదు.

కాక‌పోతే షూటింగ్ కి వెళ్లిన‌ప్పుడు ఇది క‌దా మ‌న ఏరియా అనిపించింది.

డైట్ విష‌యంలో మీరు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు..?

నా ఇంట్లోనే ట్రైన‌ర్ ఉన్నాడు రామ్ చ‌ర‌ణ్. నేను ఎలా ఉండాలో చ‌ర‌ణే కేర్ తీసుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూస‌ర్ క‌దా...! త‌న సినిమా హీరో బాగా క‌నిపించాల‌ని ఆ ర‌కంగా కేర్ తీసుకున్నాడు.

ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో నాగ‌బాబు వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఆ వేదిక పై నాగ‌బాబు ఆర‌కంగా స్పందించ‌డం క‌రెక్ట్ అంటారా..?

నాగ‌బాబు హార్ట్ అయ్యాడు. ఆ వేదిక పై త‌న అభిప్రాయం చెప్పాడు. ఆ వేదిక క‌రెక్టా అంటే...నాగ‌బాబుకు అంద‌రి స‌మ‌క్షంలో మాట్లాడే అవ‌కాశం మ‌ళ్లీ ఎప్పుడో రావ‌చ్చు. అందుచేత అక్క‌డ త‌న స్పంద‌న వ్య‌క్తం చేసాడు అనుకుంటున్నాను.

రామ్ గోపాల్ వ‌ర్మ‌తో మీకు అస‌లు గొడ‌వ ఏమిటి..?

నాకు ఎవ‌రితో గొడ‌వ‌లు లేవు. అంద‌రితో స్నేహంగానే ఉంటాను. మ‌రి..ఆయ‌న ఎందుకు అలా నాపై వ్యాఖ్య‌లు చేస్తున్నాడో తెలియ‌దు. నేను వాటిని ప‌ట్టించుకోను. వాళ్ల విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తాను.

సంక్రాంతికి మీ సినిమా, బాల‌కృష్ణ సినిమా రిలీజ్ అవుతుండ‌డంతో అభిమానుల్లో బాగా పోటీ ఏర్ప‌డింది. ఈ పోటీ పై మీరేమంటారు..?

బాల‌కృష్ణ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ప్రారంభోత్స‌వంకు నేను వెళ్లాను. సోద‌రుడు బాల‌కృష్ణ సినిమా విజ‌యం సాధించాలి అని చెప్పాను. 100వ సినిమాకి అలాంటి చారిత్రాత్మ‌క క‌థ‌ను ఎంచుకోవ‌డంలోనే తొలి విజ‌యం సాధించిన‌ట్టు అని చెప్పాను. సంక్రాంతికి వ‌చ్చే అన్ని సినిమాలు విజ‌యం సాధించాలి అని కోరుకుంటున్నాను.

150వ‌ సినిమా కోసం విన్న క‌థ‌ల్లో 151, 152 సినిమాలు చేసే క‌థ‌లు ఉన్నాయా..?

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి అనే క‌థ రెడీ చేస్తున్నారు. ధృవ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఓ డిఫ‌రెంట్ స్టోరీ రెడీ చేస్తున్నాడు. బోయ‌పాటి శ్రీను 152వ సినిమా కోసం క‌థ రెడీ చేస్తున్నాడు. 

పొలిటిక‌ల్ గా డోర్స్ క్లోజ్ చేసిన‌ట్టు అనుకోవ‌చ్చా..?

డోర్స్ క్లోజ్ చేయ‌లేదు ఓపెన్ గానే ఉన్నాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో స్థ‌బ్ద‌త‌ ఏర్ప‌డింది. అందుచేత సినిమాలు చేస్తున్నాను. అలాగే మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రొగ్రామ్ కూడా చేస్తున్నాను.

పి.కె. త‌ర‌హా సినిమా చేస్తారా..?

పి.కె లో ఫ‌స్ట్ సీన్ లేకుండా ఉంటే చేస్తాను (న‌వ్వుతూ...) అమీర్ ఖాన్ గ్రేట్ ఏక్ట‌ర్. అంత టాలెంట్ నాలో ఉంది అనుకోవ‌డం లేదు.

9 సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత సినిమా చేసారు క‌దా...డ్యాన్స్ ప్రాక్టీస్ చేసారా..?

మా అమ్మాయి పెళ్లి సంద‌ర్భంగా జ‌రిగిన‌ సంగీత్ లో డ్యాన్స్ చేసాను త‌ప్పా...ప్ర‌త్యేకించి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయ‌లేదు. ఎక్క‌డ‌న్నా మంచి ట్యూన్ వింటే రేసుగుర్రంలో శృతిహాస‌న్ లా పైకి డ్యాన్స్ చేయ‌కపోయినా లోప‌ల మాత్రం డ్యాన్స్ చేసేవాడిని (న‌వ్వుతూ...)

ఈ సినిమాలో వీణ స్టెప్ లాంటి స్టెప్స్ ఉంటాయా..?

లారెన్స్ మ‌ళ్లీ వీణ స్టెప్ చేయించాడు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో హిందీలో సినిమాలు వ‌స్తున్నాయి మ‌రి తెలుగులో ఎందుకు రావ‌డం లేదు..?

వెంక‌టేష్ గురు చేస్తున్నాడు క‌దా..! కాక‌పోతే బాలీవుడ్ లో వ‌చ్చినంత‌గా తెలుగులో రావ‌డం లేదు దానికి కార‌ణం ఏమిటంటే...అలాంటి క‌థ‌లు స్టార్స్ కి చెప్ప‌క‌పోవ‌డ‌మే.

ప‌వ‌న్ పొలిటిక‌ల్ జ‌ర్నీ గురించి మీరేమంటారు..?

త‌న స్టైల్ లో త‌ను వెళుతున్నాడు. ఏదైనా మంచే జ‌రుగుతుంది అనుకుంటున్నాను.

ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి స్టేడియంలో అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి..?

కోర్టు ఆర్డర్ గురించి తెలుసుకోకుండా అనుమ‌తి ఇచ్చారు ఆత‌ర్వాత తెలుసుకోవ‌డంతో క్యాన్సిల్ అయ్యింది. అంతే త‌ప్పా దీనికి వెన‌క ప్ర‌చారంలో ఉన్న‌ట్టు రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయని నేను అనుకోవ‌డం లేదు.

సోష‌ల్ మీడియా బాగా పెరిగింది క‌దా..! పెరిగిన ఈ సోష‌ల్ మీడియాలో అభిమానులు, త‌మ హీరో పై కాకుండా వేరే హీరోల పై కామెంట్స్ చేస్తున్నారు చూస్తుంటే ఏమ‌నిపిస్తుంది..?

టెక్నాలజీని నియంత్రించలేం. ఎవ‌రికి వారు విచ‌క్ష‌ణ ఉండాలి. హ‌ద్దులు దాట‌కుండా ఉండాలి. యుట్యూబ్స్ లో వ్యూస్ కోసం ఏదో ఏదో హెడ్డింగ్ పెట్టి వార్త‌లు రాస్తున్నారు. తీరా చూస్తే అందులో ఏమీ ఉండ‌దు. ఇలాంటి హెడ్డింగ్స్ తో వార్త‌లు రాయ‌డం చాలా బాధాక‌రం. నేను నా తోటి హీరోల‌తో స్నేహంగా ఉంటాను. ఇప్పుడు చ‌ర‌ణ్ - మ‌హేష్ ఇద్ద‌రూ ఫ్యామిలీతో క‌లిసి ఇటీవ‌ల‌ విదేశాల‌కు వెళ్ళి వ‌చ్చారు. అలాగే అఖిల్ చ‌ర‌ణ్ కోసం వ‌స్తుంటాడు. ఎన్టీఆర్...ఇలా యంగ్ జ‌న‌రేష‌న్ హీరోలు కూడా ఫ్రెండ్లీగా ఉండ‌డం చూసి చాలా హ్యాఫీగా ఫీల‌వుతుంటాను. సో...సోష‌ల్ మీడియాను నియంత్రించలేం. అందుచేత హీరోలే ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ల‌కు ఆవిధంగా రాసే అవ‌కాశం ఉండ‌దు అని నా అభిప్రాయం.

చ‌ర‌ణ్ కెరీర్ ఎలా ఉంది అనుకుంటున్నారు...?

చ‌ర‌ణ్ కెరీర్ ను బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎంత ఆడింది అనేది కాదు మంచి సినిమాలు డిఫ‌రెంట్ సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు. అలా ఆలోచించే గోవిందుడు అంద‌రివాడేలే సినిమా చేసాడు. ధృవ సినిమా నాకు చాలా బాగా న‌చ్చింది. చ‌ర‌ణ్ కెరీర్ విష‌యంలో హ్యాపీ.

చ‌ర‌ణ్ కి ఫ్యామిలీలోనే కాంపిటేష‌న్ ఉంది మీరేమంటారు..?

బ‌న్ని, చ‌ర‌ణ్ చాలా స‌ర‌దాగా ఉంటారు. ఎవ‌రి సినిమాలు వారివి. అంద‌మైన పోటీ..హెల్దీ కాంపిటిషన్. మా పిల్ల‌లు పోటీప‌డి సినిమాలు చేస్తుంటే గ‌ర్వంగా ఉంటుంది. అలాగే నేను ప్ర‌తిదీ ప‌రిశీలిస్తాను అనే భ‌యం కూడా వాళ్ల‌కు ఉంటుంది.

150 సినిమాల్లో న‌టించారు క‌దా..! ఇంకా చేయాల‌నుకుంటున్న‌పాత్ర‌లు ఏమిటి..?

ఎన్ని పాత్ర‌లు చేసినా ఇంకా ఏదో చేయాల‌ని ఉంటుంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు చ‌నిపోయే వ‌ర‌కు న‌టిస్తూనే ఉన్నారు. ప్ర‌తి ఆర్టిస్టు చ‌నిపోయే వ‌ర‌కు న‌టించాల‌నే అనుకుంటాడు. అయితే...ప్రేక్షకులు మ‌నం తెర పై క‌న‌ప‌డితే ఎంజాయ్ చేసేలా ఉండాలి కానీ...వీడు ఇంకా న‌టిస్తున్నాడా అనిపించుకోకూడ‌దు.

ఖైదీ నెం 150 ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేస్తుంది..? ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారు..?

నేను రికార్డ్స్ గురించి ప‌ట్టించుకోను. ఆ విష‌యంలో నాకు జీరో నాలెడ్జ్. క‌లెక్ష‌న్లు, రికార్డుల లెక్క‌లు చ‌ర‌ణ్ చూసుకుంటాడు.

మెగా హీరోలు ఒక్కొక్క‌రి గురించి చెప్ప‌మంటే ఏం చెబుతారు..?

చ‌ర‌ణ్ - సీరియ‌స్, బ‌న్ని - ఆక‌తాయిత‌నం, వ‌రుణ్ తేజ్ - నిల‌క‌డ‌గా ఉంటాడు, సాయిధ‌ర‌మ్ తేజ్ - బ‌బ్లీ, నిహారిక - ట్రెండీగా ఉంటుంది

అమీర్ ఖాన్ ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు మీతో క‌లిసి న‌టించాలి అనుకుంటున్న‌ట్టు చెప్పారు మీరు న‌టిస్తారా..?

అమీర్ ఖాన్ నాతో క‌లిసి న‌టించాలి అని చెప్ప‌డం నాలో ఉత్సాహాన్ని ఇస్తుంది. మేమిద్ద‌రం క‌లిసి చేసే క‌థ కుదిరితే చేస్తాం. ఈ సంద‌ర్భంగా అమీర్ ఖాన్ కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

బాలీవుడ్ లో హీరోలు త‌మ వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు చేస్తున్నారు. అలా మ‌నం చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి..?

వెంక‌టేష్ వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు పాత్ర‌లు చేస్తున్నాడు. ర‌జ‌నీకాంత్ లింగా, క‌బాలి...ఇలా వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు పాత్ర‌లు మ‌నం కూడా చేస్తున్నాం. మేము చేయాలంటే ముందు అలాంటి క‌థ‌లు రావాలి. మేము కూడా ఛాలెంజింగ్ గా ఉన్న పాత్ర‌లు చేయాలి అనుకుంటాం క‌దా..! క‌థ‌లు వ‌స్తే త‌ప్ప‌కుండా అంద‌రూ చేస్తారు.