దుల్కర్ సల్మాన్‌తో మీనాక్షి చౌదరి.. క్రేజీ టైటిల్‌తో సినిమా..
మరో తెలుగు సినిమా చేస్తున్నరు దుల్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో గతంలో ఓ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ఈ మూవీ ప్రారంభమైంది.
దుల్కర్ సల్మాన్.. తెలుగులో మంచి మార్కెట్ ఏర్పర్చుకున్నాడు. ఆయన `మహానటి`తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. ఇటీవల `సీతారామం` చిత్రంతో టాలీవుడ్ హీరో అయిపోయాడు. మనలో ఒకరిగా టాలీవుడ్ ఆడియెన్స్ ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. అదే సమయంలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో తెలుగు సినిమా చేస్తున్నరు దుల్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో గతంలో ఓ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆదివారం ఈ మూవీ ప్రారంభమైంది. అయితే ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి `లక్కీ భాస్కర్` అనే క్రేజీ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గత కొన్నేళ్లుగా విభిన్న చిత్రాలను అందిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత చురుకైన నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ధనుష్‌తో ఇప్పటికే `సార్` వంటి పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించగా ఇప్పుడు, రెండో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తుండటం విశేషం.
`ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణం కొలవలేని ఎత్తులకు` అనే క్యాప్షన్‌తో, ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణంగా ఈ చిత్రం రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
మీనాక్షి చౌదరి నెమ్మదిగా ఒక్కో సినిమాని దక్కించుకుంటూ బిజీ అవుతుంది. స్టార్ హీరోయిన్లకి పోటీ ఇస్తుంది. ఈ బ్యూటీ `హిట్` చిత్రంతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో పాపులర్ అయ్యింది. అంతకు ముందు రవితేజతో `ఖిలాడీ` మూవీలో మెరిసింది. ఆ మధ్య తమిళంలో విజయ్ ఆంటోనీతో `హత్య` మూవీ చేసింది. ప్రస్తుతం `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు విశ్వక్ సేన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాని ప్రారంభించింది. దీంతోపాటు ఒకటి రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది.