అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన యాప్ టిక్ టాక్.  ఈ యాప్ లో వీడియోలు అప్ లోడ్ చేయటంతో రకరకాల సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు యూత్. కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదొక డిసీజ్ లాగ మారి యూత్ ని ఇబ్బంది పెడుతోంది. ఆ పాయింట్ ని తన సినిమాలోకి తీసుకువస్తున్నారు ప్రముఖ దర్శకుడు మారుతి.

ఈ మధ్యకాలంలో మారుతి చేస్తున్న చిత్రాల్లో ఏదో ఒక డిజార్డర్ ని తీసుకుంటున్నారు. మతిమరుపు, ఓసిడి వంటి సమస్యలపై సినిమాలు చేసిన మారుతి ఈ సారి టిక్ టాక్ సమస్యను తమ సినిమాలో తీసుకొచ్చి నవ్వులు పండించనున్నట్లు టాక్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ హీరోగా చేయనున్నారు. హీరోయిన్ కు ఇలా వీడియోలు చేసే జబ్బు ఉంటుందని వాటి నుంచి పుట్టే సమస్యలు ఫన్నీగా ఉంటాయని చెప్తున్నారు. 

 సాయి ధరమ్  ‘చిత్రలహరి’ చేసి చాలా కాలం తర్వాత రిలాక్స్ ఉన్నాడు.  కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన  ఆ చిత్రం యావరేజ్ అనుకున్నా సాయిని ఒడ్డున పడేసింది. ఈ ఉత్సాహంతో మారుతి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నంలో ఉన్నాడు సాయి.   ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ప్రతి రోజూ పండుగే అనే టైటిల్ ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2020 సంక్రాంతి సమయంలో ఈ సినిమాను విడుదల చేస్తారు కాబట్టి ఆ టైటిల్ యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు. 

ఇక ఈ  చిత్రంలో హీరోయిన్ గా రెజీనా కసాండ్రా పేరు వినిపిస్తున్నప్పటికీ ఆమె బదులు మరొక  స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని ప్రయత్నాలైతే జరుగుతున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ మరియు యు వి క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.