సారాంశం
ఖుష్బు, త్రిష, చిరంజీవిలపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు ..
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)పై ఇటీవలే అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan)పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మన్సూర్ కామెంట్ పై సినిమా వాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన్సూర్ కు అభిమానిలాంటి లియో దర్శకుడు లోకేశ్ కనగరాజు సహా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తదితర నటులు మన్సూర్‌పై మండిపడ్డారు. త్రిష సైతం ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు మన్సూర్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి.. నటుడిపై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో పోలీసులు అతడిపై కేసు కూడా నమోదు చేశారు
మరో ప్రక్క . నడిగర్ సంఘం (Nadigar Sangam) సైతం ఆయనపై చర్యలు చేపట్టింది. ఆయనపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఎట్టకేలకు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. త్రిషపై తనకు ఎలాంటి దురుద్దేశం లేదని.. తాను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశానంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. త్రిష గురించి మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతూ మన్సూర్ అలీఖాన్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటనలో, 'నా తోటి నటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి' అని చెప్పాడు. ఈ నేపథ్యంలో నటి త్రిష తన సోషల్ మీడియా పేజీలో 'తప్పు చేయడం మానవుడి సహజం, క్షమించడం అనేది దైవం చూసుకుంటుంది' అని పోస్ట్ చేసింది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్టైంది. అయితే ఆ ముగింపుకు మన్సూర్ ఒప్పుకునేటట్లు లేరు. ఆయన దాన్ని మళ్లీ కాక రేపుతున్నారు.
ఖుష్బు, త్రిష, చిరంజీవిలపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు మన్సూర్ అలీఖాన్ ప్రకటించారు. తన లాయర్ గురు ధనంజయన్ ద్వారా రేపు కోర్టులో కేసు వేయబోతున్నట్లు తెలిపారు. వారి ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని ఆయన ప్రకటించాడు. నవంబర్ 11న విలేకరుల సమావేశంలో తాను మాట్లాడిన ‘నిజమైన వీడియో’ని వారికి పంపించానని మన్సూర్ తెలిపాడు.
అనగా సరిగ్గా వారం తర్వాత నవంబర్ 19న జరిగిన ఈ వీడియోనే తన ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించారన్నారు. ఈ కేసులో తాను నిజమైన వీడియోను పంపానని, మరికొన్ని ఆధారాలతో రేపు కేసు నమోదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. దాంతో ముగిసిపోయిన గొడవను మళ్లీ తెరపైకి రాబోతోంది. మరి చిరంజీవి ,ఖుష్బు దీనిపై ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.