శుక్రవారం నాడు ఉదయం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. మొదట ఆయన గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన శరీరంపై గాయాలు ఉండడం అనుమానాలకు దారితీసింది.

పోస్ట్ మార్టం అనంతరం ఆయనది హత్య అని తేలింది. ఈ విషయం వైఎస్ కుటుంబాన్ని మరింత విచారానికి గురి చేసింది. మంచు ఫ్యామిలీ కూడా వివేకా మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వైఎస్ ఫ్యామిలీకి వివేకా దగ్గర బంధువు. 

ఇది ఇలా ఉండగా.. వివేకా హత్యపై కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ మంచు విష్ణు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులపై మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై కొందరు రాజకీయనాయకుడు చేస్తోన్న కామెంట్స్ వింటుంటే వారికి కనీసం మానవత్వం కూడా లేదనిపిస్తోందని అన్నారు.

ఇలాంటి క్రూరమైన చర్యలను ఖండించకుండా నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చావుని కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటూ, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.