మంచు విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన `ఢీ` సినిమా మంచి విజయం సాధించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. మళ్లీ ఇటీవల కాలంలో దీనికి సీక్వెల్‌ వస్తుందని వార్తలు వినిపించాయి. మొత్తానికి ఇన్నాళ్ళకు దానికి క్లారిటీ వచ్చింది. వినోదం డబుల్‌ డోస్‌లో రాబోతుందట. 

13ఏళ్ళ తర్వాత మంచు విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. దీనికి `డీ అండ్‌ డీః డబుల్‌ డోస్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఢీ అండ్‌ ఢీ బేడీలను పోలి ఉండటం విశేషం. వినోదం డబుల్‌ అన్న మీనింగ్‌లో దీన్ని విడుదల చేశారు. మొత్తానికి ఇది `ఢీ`కి సీక్వెల్‌ అని పరోక్షంగా చెప్పారు. 

శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని విష్ణు బర్త్ డేని పురస్కరించుకుని సోమవారం ప్రకటించారు. ఈ సినిమాని తన 24ఫ్రేమ్ ఫ్యాక్టరీస్‌ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ డబుల్‌ ఫన్‌ అని పేర్కొన్నారు. 

అయితే శ్రీనువైట్ల మార్క్ కామెడీకి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి కాలం చెల్లింది. ఫ్యామిలీ డ్రామా మరీ బోరింగ్‌గా మారింది. దీంతో ఆయన చేసిన సినిమాలు ఇటీవల సక్సెస్‌ కాలేకపోతున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది? అప్పటి మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా? ఫెయిల్యూర్‌లో ఉన్న విష్ణుకి, శ్రీనువైట్లకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందా? అన్నది చూడాలి.