చంద్రబాబుతో భేటీ కానున్న మంచు మనోజ్.. టీడీపీలో చేరతారా?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ భేటీ కానున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి చంద్రబాబుతో భేటీ కానున్నట్టుగా సమాచారం. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చంద్రబాబుతో మనోజ్ దంపతులు భేటీ కానున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
మంచు ఫ్యామిలీ విషయానికి వస్తే.. చాలా ఏళ్ల కిందట మోహన్‌బాబు టీడీపీలో కొనసాగారు. ఆ తర్వాత చంద్రబాబుకు, మోహన్‌బాబుకు దూరం పెరిగింది. చంద్రబాబుపై ఒకటిరెండుసందర్భాల్లో మోహన్‌బాబు విమర్శలు చేశారు. ప్రస్తుతం మోహన్‌బాబు కుటుంబానికి, వైఎస్ ఫ్యామిలీకి బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు భార్య వెరోనికా ఏపీ సీఎం జగన్‌కు సోదరి అవుతారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడి కుమార్తెనే వెరోనికా.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై టీడీపీకి వ్యతిరేకంగా మోహన్ బాబు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబుపై మోహన్‌బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. అయితే మూడేళ్ల క్రితం మోహన్‌బాబు తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం సాగిన.. ఆ దిశగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
అయితే గత కొంతకాలంగా మంచు సోదరులు విష్ణు, మనోజ్‌ల మధ్య సత్సబంధాలు లేవనే ప్రచారం సాగుతుంది. మరోవైపు మనోజ్.. భూమా మౌనిక రెడ్డిని విహహం చేసుకున్నారు. ప్రస్తుతం భూమా మౌనిక రెడ్డి సోదరి, సోదరుడు టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే ఈ క్రమంలోనే చంద్రబాబుతో మనోజ్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.