తనను అనుచిత ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ పై మంచు లక్ష్మి కంప్లైంట్ చేశారు. అతను అడిగిన ప్రశ్నలు వ్యక్తిగత దాడిలా అనిపించాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

జర్నలిస్ట్ పై మంచు లక్ష్మి కంప్లైంట్

టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనపై వేసిన అనుచిత ప్రశ్నలపై తీవ్రంగా స్పందించారు. తన గౌరవానికి భంగం కలిగించే విధంగా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు తాను తట్టుకోలేకపోయానని, అవి సాధారణ ఇంటర్వ్యూ భాగంగా కాకుండా వ్యక్తిగత దాడిలా అనిపించాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో, మంచు లక్ష్మి ఫిల్మ్ ఛాంబర్‌ను సంప్రదించి, సంబంధిత జర్నలిస్టుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారికంగా కంప్లైంట్ చేశారు.

మంచు లక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆ జర్నలిస్టు మంచు లక్ష్మి వయసు, ఆమె ధరించే దుస్తుల గురించి ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలు వ్యక్తిగత హుందాతనాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, అవి తనను తీవ్రంగా బాధించాయని ఆమె పేర్కొన్నారు. తనపై ప్రశ్నల రూపంలో జరిగిన ఈ దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు.

జర్నలిస్టులపై గౌరవం ఉంది

ఈ అంశంపై మాట్లాడిన మంచు లక్ష్మి, “జర్నలిస్టులపై నాకు గౌరవం ఉంది. కానీ ఇది జర్నలిజం కాదు. కనీసం విమర్శ కూడా కాదు. పురుషాధిపత్యం ఉన్న పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడిన తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురవడం బాధాకరం. మౌనంగా ఉంటే ఇలాంటి ప్రవర్తన కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఈ దశలోనే స్పందించాలనుకున్నాను,” అని చెప్పారు.

ఫిల్మ్ ఛాంబర్‌కు ఆమె చేసిన ఫిర్యాదులో, జర్నలిస్టు పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు ప్రజలకు సమాచారాన్ని చేరవేయాల్సినవే కానీ.. అవి మార్గం తప్పి, వ్యక్తిగత దాడులవైపు మళ్లడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు.ఈ ఘటన టాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖులు, అభిమానులు, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మంచు లక్ష్మికి నెటిజన్ల మద్దతు

మంచు లక్ష్మి చర్యకు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. జర్నలిజంలో తగిన నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని, ప్రతి ఇంటర్వ్యూ విలువైనదిగా ఉండాలన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ స్పందన, జర్నలిస్టుపై తీసుకునే చర్యలు తదితర అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.