రోజావే చిన్ని రోజావే, అనగనగా ఆకాశం ఉంది పాటల గాయకుడు జయచంద్రన్ కన్నుమూత
తెలుగుతో పాటు సౌత్ ఇండియాన్ భాషల్లో వందల పాటలు పాడిన గాయకుడు పి. జయచంద్రన్ కన్నుమూశారు.
త్రిశూర్: ప్రముఖ గాయకుడు పి. జయచంద్రన్ కన్నుమూశారు. త్రిశూర్ అమల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. సాయంత్రం 7 గంటలకు తన ఇంట్లో అస్వస్థత కు గురి అయ్యారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, ఒక సంవత్సరం పాటు అమల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా సాగిన తన సంగీత జీవితంలో వెయ్యికి పైగా పాటలు పాడారు. సినిమాలు, భక్తిగీతాలు, లలిత సంగీతంలో ఆయన గాత్రం ప్రసిద్ధి చెందింది.
1944 మార్చి 3న ఎర్నాకులం జిల్లాలోని రవిపురంలో జన్మించిన ఆయన, తరువాత ఇరియన్‌గలకుడకు మారారు. గాయకుడు యేసుదాస్ స్నేహితుడైన ఆయన అన్నయ్య సుధాకరన్ ద్వారా చలనచిత్ర పిన్నణి గాన రంగంలోకి ప్రవేశించారు. 1965లో 'కుంజాలి మరక్కర్' చిత్రంలో పి. భాస్కర్ రాసిన 'ఒరు ముల్లాపూ మాలయుమాయ్' అనే పాటను చిదంబరనాథ్ సంగీత దర్శకత్వంలో పాడారు. ఈ చిత్రం విడుదలకు ముందు, మద్రాసులో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో జయచంద్రన్ పాడిన రెండు పాటలు విన్న దర్శకుడు ఎ. విన్సెంట్ సిఫారసు మేరకు, సంగీత దర్శకుడు జి. దేవరాజన్ 'కలితోజన్' చిత్రంలో పి. భాస్కర్ రాసిన 'మంజలయిల్ ముంగి తోర్తి' అనే పాటను పాడించారు. 1967లో విడుదలైన ఈ చిత్రంలోని పాటకు మంచి ఆదరణ లభించింది.
తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించారు పి. జయచంద్రన్. ఇళయరా, రెహామాన్, కీరవాణి, కోటీ సంగీత సారధ్యంలో హిట్ సాంగ్స్ పాడారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే... వెంకటేష్ సూర్య వంశం సినిమాలో రోజావే చిన్ని రోజావే పాటతో పాటు.. తరుణ్ హీరోగా మొదటి సినిమా అయిన నువ్వే కావాలి లో అనగనగా ఆకాశం ఉంది పాటు అద్భుతంగా ఆలపించారు జయచంద్రన్. ఆయన మరణంతో సౌత్ ఇండియాన్ సంగీత ప్రేమికులు ఎంతో బాధపడుతున్నారు.