బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తనను ఎవరైనా ఐటెం గర్ల్ అంటే పళ్లు రాలగొడతానంటోంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఐటెం సాంగ్స్ లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పటికీ ఐటెం సాంగ్స్ లో నటించే ఛాన్స్ వస్తోంది. అయితే తన గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఐటెం గర్ల్ అని అంటున్నారట.

ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయని, దర్శకనిర్మాతలు సినిమాలలో ప్రత్యేక గీతాలు ఉండేలా చూసుకుంటున్నారని చెప్పిన మలైకా తనకు నచ్చే ప్రత్యేక గీతాల్లో నటించినట్లు వెల్లడించింది.

ఎవరి బలవంతం మీదనో తాను ప్రత్యేక గీతాలు ఎంపిక చేసుకోలేదని. అవి తనకు సౌకర్యంగానే ఉంటాయని చెప్పింది. అయితే తాను ఏదైనా పాటలో నర్తిస్తే దాన్ని అందరూ ఐటెం సాంగ్ అంటుంటారని, అది తనకు చాలా కోపం తెప్పిస్తుందని వెల్లడించింది. ఒకవేళ ఎవరైనా తనను 'ఐటెం గర్ల్' అని అంటే వారి పళ్లు రాలగొడతాను అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.

ప్రత్యేక గీతాల్లో ఎలాంటి అసభ్యత ఉందని, సినిమాలో కాస్త ఫన్ ఉండాలంటే ఇలాంటి పాటలుఉండి తీరాల్సిందేనని అంటోంది మలైకా. ఆమె చివరిగా 'పటాఖా' చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో నటించింది.