మహేష్‌ బాబు బావ సుధీర్‌ బాబు సినిమాలో నమ్రత శిరోద్కర్‌ చెల్లి శిల్పా శిరోద్కర్‌ నటించారు. అయితే ఆమె నటనకు జాతీయ అవార్డు పక్కా అంటున్నారు నిర్మాత. 

సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న మూవీ `జటాధర`. ఈ చిత్రంతో బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా తెలుగు ఆడియెన్స్ ని పలకరించబోతుంది. అలాగే ఈ మూవీలో మహేష్‌ బాబు మరదలు శిల్పా శిరోద్కర ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వెంకట్‌ కళ్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మంచి బజ్‌ ఉంది. విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అంచనాలను పెంచాయి. సుధీర్‌ బాబు కెరీర్‌లోనే ఇదొక భారీ సినిమాగా ఉండబోతుంది. ఇందులో ఫాంటసీ, హర్రర్‌ ఎలిమెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో మైథలాజికల్‌ టచ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకం నిర్మిస్తోంది.

‘ఖుదా గవా’, ‘మృత్యుదంద్’ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న శిల్పా శిరోద్కర్ ‘జటాధర’ చిత్రంలోని పర్ఫామెన్స్‌తో అవార్డులన్నీ గెలిచేస్తారని నిర్మాత ప్రేరణ అరోరా అన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. `జటాధర`లోని శోభ అనే పాత్రలో నటించిన శిల్పా శిరోద్కర్‌కు అన్ని అవార్డులు వస్తాయని ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. శోభ ఒక శక్తివంతమైన, సంక్లిష్టమైన పాత్ర. ఈ పాత్రకు ఆమె తన నటనతో ఎంతో ఇంటెన్స్‌ను తీసుకు వచ్చి న్యాయం చేశారు. ఆమె ప్రేక్షకులకు పూర్తిగా ఆశ్చర్యపరుస్తుంది’ అని అన్నారు.

‘జటాధర’ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. సస్పెన్స్, యాక్షన్, మిస్టరీల ప్రత్యేకమైన కథతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ‘జటాధర’లో శిల్పా శిరోద్కర్, సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే శోభ పాత్రలో నటి శిల్పా శిరోద్కర్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ‘జటాధర’ ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు.

మహేష్‌ మరదలు శిల్పా శిరోద్కర్‌ 23ఏళ్ల క్రితం `బ్రహ్మా`(1992) అనే తెలుగు సినిమాలో నటించారు. ఆ తర్వాత ఇన్నాళ్లకి ఆమె తెలుగు సినిమా చేయడం విశేషం. అదే సమయంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా సైతం ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. ఇందులో సుధీర్‌ బాబు, సోనాక్షి మధ్య యాక్షన్‌ సీన్లు అదిరిపోయేలా ఉన్నాయి. ఈ మూవీని తెలుగు, హిందీలో తెరకెక్కించారు. త్వరలో విడుదలపై క్లారిటీ రానుంది.