మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట చిత్రీకరణ త్వరలో మొదలుకానుంది. దర్శకుడు పరశురామ్ ఓ వినూత్నమైన సబ్జెక్టుతో ఈ చిత్రాన్నితెరకెక్కించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్స్ కి భారీ ఆదరణ దక్కింది. డబ్బు చుట్టూ తిరిగే కథలో మహేష్ పాత్ర ఏంటి అనే ఆసక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఆయన లుక్ అండ్ యాటిట్యూడ్ దర్శకుడు డిఫరెంట్ గా రాసుకున్నట్లు సమాచారం. 

కాగా ఈ మూవీపై ఓ క్రేజీ గాసిప్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. సర్కారు వారి పాటలో అదిరిపోయే ఓ ఐటెం సాంగ్ ఉంటుందట. ఆ సాంగ్ లో స్టెప్స్ వేసే హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్న చిత్ర యూనిట్ కాజల్ పై మొగ్గు చూపుతున్నారట. ఇక మహేష్ హీరోయిన్ కాజల్ కి ఇదే విషయమై ఫోన్ చేసి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ కోరితే కాజల్ కాదంటుందా చెప్పండి. ఈ కథనాలు నిజమైతే మహేష్ పక్కన కాజల్ ని మాస్ స్టెప్స్ వేస్తూ చూడవచ్చన్న మాట. 

గతంలో కాజల్ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో 'పక్కా లోకల్' అనే ఐటెం సాంగ్ లో నటించింది. ఇక కాజల్ మహేష్ జంటగా బిజినెస్ మేన్, బ్రహ్మోత్సవం చిత్రాలలో కలిసి నటించారు. కాగా సర్కారు వారి పాట మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ మరియు జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.