Asianet News TeluguAsianet News Telugu

బి.ఎ.రాజు మరణం తీరని లోటుః మహేష్‌, ఎన్టీఆర్‌, నాని, విశాల్‌, కళ్యాణ్‌ రామ్‌ సంతాపం

ఇండస్ట్రీలోని అందరు టెక్నీషియన్లతో మంచి అనుబంధం ఉన్న ఆయన టాలీవుడ్‌లో ఎన్నో మార్పులు చూశారు. ఎన్నో సినిమాలకు తన చేతుల మీదుగా పబ్లిసిటీ చేశారు. ఆయన మరణం తమకి తీవ్ర దిగ్ర్భాంతికి, షాక్‌కి గురి చేసిందంటున్నారు సినీ తారలు. మహేష్‌, విశాల్‌, కొరటాల శివ, ఎన్టీఆర్‌ వంటి హీరోలు స్పందించి సంతాపాలు తెలియజేశారు. 

mahesh ntr nani vishal raghavendra rao koratala siva deep condolence to b a raju  arj
Author
Hyderabad, First Published May 22, 2021, 8:33 AM IST

ప్రముఖ సినీ పాత్రికేయుడుగా, నిర్మాతగా, పీఆర్వోగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు బి.ఏ.రాజు. పీఆర్వోలకు పెద్ద దిక్కుగా, సినీ జర్నలిస్ట్ లకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన హఠాన్మరణం జర్నలిస్ట్ లు, పీఆర్వోలకే కాదు సినీ పరిశ్రమకి తీరని లోటు. ఇండస్ట్రీలోని అందరు టెక్నీషియన్లతో మంచి అనుబంధం ఉన్న ఆయన టాలీవుడ్‌లో ఎన్నో మార్పులు చూశారు. ఎన్నో సినిమాలకు తన చేతుల మీదుగా పబ్లిసిటీ చేశారు. ఆయన మరణం తమకి తీవ్ర దిగ్ర్భాంతికి, షాక్‌కి గురి చేసిందంటున్నారు సినీ తారలు. మహేష్‌, విశాల్‌, కొరటాల శివ, ఎన్టీఆర్‌ వంటి హీరోలు స్పందించి సంతాపాలు తెలియజేశారు. 

మహేష్‌ స్పందిస్తూ, `బి.ఏ.రాజుగారు లేరనే వార్తని ఊహించుకోలేకపోతున్నా. నా చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. మేం కలిసి చాలాఏళ్లుగా ట్రావెల్‌ చేస్తున్నాం. చాలా దగ్గరగా మా జర్నీ సాగుతుంది. ప్రొఫేషనల్‌గా సినిమా పట్ల అపారమైన మక్కువ కలిగిన పెద్ద మనిషి. మా కుటుంబం అతనికి పెద్ద ప్రపంచంగా భావించేవారు. మీడియా సోదరులకు గొప్ప నష్టం. రాజుగారి ఆత్మకి శాంతి చేకూరాలి. ఈ కఠినమైన సమయాల్లో తన కొడుకుకి ప్రేమని, బలాన్ని పంపుతున్నాం` అని పేర్కొన్నారు మహేష్. 

ఎన్టీఆర్‌ స్పందిస్తూ, `బి.ఏ.రాజు ఆకస్మిక మరణం నన్ను దిగ్ర్భాంతికి గురి చేసింది. అత్యంత సీనియర్‌ ఫిల్మ్ జర్నలిస్ట్ లలో ఒకరు. పీఆర్వోలో ఒకరు. ఆయన చిత్ర పరిశ్రమకి ఎంతో కృషి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్నప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. చాలా పెద్ద నష్టం. ఆయన కుటుంబానికి బలం చేకూరాలని కోరుకుంటున్నా` అని చెప్పారు.

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ స్పందిస్తూ, `సీనియర్‌ ఫిల్మ్ జర్నలిస్ట్, పీఆర్వో బి.ఏ.రాజు ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నా కెరీర్‌ ప్రారంభం నుంచి నాతో పనిచేశారు. ఇది మన చిత్ర పరిశ్రమకి పెద్ద నష్టం` అని తెలిపారు. 

హీరో నాని స్పందిస్తూ, ప్రతి శుక్రవారం ప్రతి సినిమా కోసం వైట్‌ హార్ట్ పనిచేస్తుందని ఆశించిన ఒక వ్యక్తి బిఏ రాజు తప్పిపోయారు. మీ వాట్సాప్‌ మెసేజెస్‌ మిస్‌ అయ్యాయి. మీ బేషరతు ప్రేమ తప్పిపోతుంది` అని ట్వీట్‌ చేస్తూ సంతాపం తెలిపారు.

హీరో విశాల్‌ ట్వీట్‌ చేస్తూ, `నా హృదయం ముక్కలైంది. సర్వనాశనమైపోయింది. బి.ఏ.రాజుగారు ప్రియమైన స్నేహితుడు. ఒక సోదరుడు, నిజమైన వెల్‌ విషర్‌. అతను నా కెరీర్‌ ని ఎంతో ప్రోత్సహించారు. ఈ నష్టాన్ని అధిగమించడానికి చాలా టైమ్‌ పడుతుంది` అని చెప్పారు.

కొరటాల శివ చెబుతూ, `బి.ఏ.రాజుగారు మరణించారనే వార్త నన్ను షాక్‌కి గురి చేసింది. నిజమైన సానుకూల ఆత్మ ఆయనది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. నాపై, నా సినిమాలపై మీకున్న ప్రేమ నిజంగా చిరస్మరణీయమైనది. నేను దానికి ఎప్పటికీ ఆదరిస్తాను. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం` అని తెలిపారు.

కె.రాఘవేంద్రరావు స్పందిస్తూ, బి ఏ రాజు... నువ్వు లేని తెలుగు సినిమా మీడియా, పబ్లిసిటీ, ఎప్పటికీ లోటే... తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు.

వీరితోపాటు సత్యదేవ్‌, ఆనంద్‌ దేవరకొండ వంటి ప్రముఖులు సంతాపాలు తెలియజేశారు. ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు  (21- 05- 2021) శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, కాలమిస్ట్, దర్శకురాలు జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios