మహేష్‌బాబు మొదటి సారి ఓ పౌరాణిక సినిమా చేయబోతున్నాడా? ఆయన `ప్రతాపరుద్రుడి`గా కనిపించబోతున్నాడా? అంటే అవుననే టాక్‌ వినిపిస్తుంది. తనకు `ఒక్కడు`, `అర్జున్‌`, `సైనికుడు` లాంటి విజయవంతమైన సినిమాలను అందించిన గుణ శేఖర్‌ దర్శకత్వంలో మహేష్‌ `ప్రతాపరుద్రుడు` పేరుతో రూపొందే చిత్రంలో నటించబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం గుణశేఖర్‌.. సమంతతో `శాకుంతలం` సినిమాని రూపొందిస్తున్నారు. 

కరోనా వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ని త్వరలోనే ప్రారంభించనున్నారు. దీని తర్వాత వెంటనే రానాతో `హిరణ్యకశ్యప` చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. వేగంగా ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన మహేష్‌తో `ప్రతాపరుద్రుడు` సినిమా తీసేందుకు గుణశేఖర్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్‌..పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారువారిపాట` చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే త్రివిక్రమ్‌తో సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. ఈ రెండు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. దీని తర్వాత అనిల్‌రావిపూడితో ఓ కమిట్‌మెంట్‌ ఉందని సమాచారం. అలాగే రాజమౌళి సైతం మహేష్‌తో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. మరి మహేష్‌.. గుణశేఖర్‌కి ఓకే చెబితే.. రాజమౌళి ప్రాజెక్ట్ ఉండదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. లేక గుణశేఖర్‌ తో సినిమాలో వాస్తవం లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మొత్తానికి ఇప్పుడు రాజమౌళితో ప్రాజెక్ట్ విషయంలోనే అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో మున్ముందు చూడాలి. చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి మార్పు అయినా జరగవచ్చు. అనుకున్న ప్రాజెక్ట్ లు క్యాన్సిల్‌ అయి ఊహించని కొత్త ప్రాజెక్ట్ లు తెరపైకి రావచ్చు. సినిమా సెట్స్ పైకి వెళ్లేంత వరకు అన్నీ సస్సెన్సే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.