బాహుబలి,కేజీఎఫ్ సక్సెస్ తర్వాత సౌత్ హీరోలంతా పాన్ ఇండియా సినిమా చెయ్యాలని ఉత్సాహపడుతున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రీసెంట్ గా ప్రభాస్ ..సాహో అనే పాన్ ఇండియా సినిమాతో నార్త్ ని పలకరించారు. అలాగే కన్నడ స్టార్ హీరో సుదీప్ సైతం బాలీవుడ్ మార్కెట్ లోకి ప్రవేశించాలని పహిల్వాన్ అనే సినిమా చేసారు. మరికొద్ది రోజుల్లో సైరా చిత్రం రాబోతోంది. అలాగే రాజమౌళి తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ సైతం పాన్ ఇండియా సినిమానే.

ఇవన్నీ గమనిస్తున్న మహేష్ కు  తానుకూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించాలనే  ఆలోచన వచ్చింది. గతంలో తమిళ మార్కెట్లోకి వెళ్దామని మురగదాస్ తో చేసిన స్పైడర్ ప్రయత్నం ఫలించలేదు. దాంతో కాస్త సైలెంట్ అయిన మహేష్ ఈ సారి పక్కా ప్లానింగ్ తో పాన్ ఇండియా సినిమా చెయ్యటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అందుకోసం ఆల్రెడీ నార్త్ లో హిట్ కొట్టిన కేజీఎఫ్ దర్శకుడునే ఎంచుకున్నాడంటున్నారు.

‘కేజీఎఫ్‌’తో బాలీవుడ్‌లోనూ విజయపతాకం ఎగరేశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.  దాంతో ఆయనతో కలసి పనిచేయడానికి తెలుగు హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఓ సినిమా ఓకే అయ్యింది. మైత్రీ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే రీసెంట్ గా  మహేష్‌బాబుకీ ఓ కథ చెప్పి ఒప్పించారని సమాచారం. ఇటీవల మహేష్‌ - ప్రశాంత్‌ మధ్య కథా చర్చలు సాగాయని, ప్రశాంత్‌ చెప్పిన కథ  మహేష్‌కి బాగా నచ్చిందని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలుఉన్నాయని తెలుస్తోంది.

అన్ని సెట్ అయితే పిబ్రవరిలోనే సినిమా ప్రారంభం కానుంది. అప్పటికి మహేష్ తన కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని రెడీ గా ఉంటారు. యాక్షన్ ఓరియెంటెడ్ గా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా ఉండబోతోందిట. ఖచ్చితంగా మహేష్ ని దేశం మొత్తం నిలబెట్టే సినిమా అవుతుందంటున్నారు.  ప్రస్తుతం  ‘కేజీఎఫ్‌ 2’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్‌. ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.