మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. నెలల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులు కన్నుమూశారు. మంగళవారం కృష్ణ మరణంతో మరింత విషాదం నెలకొంది. తాతయ్య కృష్ణ మరణాన్ని తలచుకొని సితార ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.  

మహేష్ ఇంటిలో కృష్ణ ఉండేవారు కాదు. ఆయన కూతుళ్ళ దగ్గర లేదా నరేష్ వద్ద ఫార్మ్ హౌస్లో ఉండేవారని సమాచారం. దీంతో ప్రతి వీకెండ్ పిల్లలతో పాటు మహేష్ తండ్రి కృష్ణ వద్దకు వెళ్లేవారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని లంచ్ చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. హైదరాబాద్ లో ఉంటే మహేష్ ఎన్ని పనులున్నా వీకెండ్ కృష్ణ వద్దకు వెళ్లేవారు. కృష్ణ మనవడు గౌతమ్, మనవరాలు సితారతో సరదాగా గడిపేవారు. వారిద్దరికీ తాతయ్యతో మంచి అనుబంధం ఉండేది. 

ఇప్పుడు తాతయ్య లేడన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు. ఆయన్ని తలచుకొని, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార తాతయ్య మరణాన్ని ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ''వీకెండ్ లంచ్ ఇకపై ఎప్పటికీ మునుపటిలా ఉండదు. మీరు ఎన్నో విలువైన విషయాలు నేర్పారు. నన్ను ఎంతగానో నవ్వించారు. ఇప్పుడవన్నీ మీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మీరు నా హీరో. మీరు గర్వపడేలా ఒకరోజు నేను చేస్తానని నమ్మకం ఉంది. మిమ్మల్ని నేను ఎంతగానో మిస్ అవుతున్నాను తాతగారు'' అని కామెంట్ చేశారు. సితార పోస్ట్ వైరల్ గా మారింది.

కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ తో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబంతో పాటు అభిమానుల్లో, చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం కృష్ణ భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళుర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఈరోజు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. 

View post on Instagram

నేడు మధ్యాహ్నం వరకు సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయా స్టూడియోలోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. పద్మాలయా స్టూడియోలో కొన్ని ఆచార కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం.. అక్కడి నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగనుంది. మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఈరోజు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు.