సూపర్‌ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోతోంది. బహిరంగంగా సెలబ్రేషన్స్‌ చేసే అవకాశం లేకపోవటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. అభిమానుల జోష్‌ను మరింత పెంచుతూ తన రాబోయే సినిమా సర్కార్‌ వారి పాటకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశాడు సూపర్‌ స్టార్‌. దీంతో చాలా రోజులుగా పెండిగ్‌లో ఉన్న ఓ పనిని కూడా పూర్తి చేశాడు సూపర్‌ స్టార్‌.

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు జనవరిలో మహేష్‌ బాబు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని ఛాలెంజ్‌ విసిరారు. అయితే ఈ ఇన్నాళ్లు తన బర్త్‌ డే సందర్భంగా ఆ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు మహేష్. `బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇంతకన్నా గొప్ప మార్గం ఏం ఉంటుంది. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నేను ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా ఎన్టీఆర్, విజయ్‌ (తమిళ స్టార్ హీరో), శృతి హాసన్‌లను కోరుతున్నాను. మీరంతా ఇందుకు మద్దతు తెలపాలి. పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు` అంటూ తాను మొక్క నాటిన వీడియోను షేర్ చేశాడు మహేష్ బాబు.

ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత గీత గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కార్‌ వారి పాట సినిమాను ఎనౌన్స్‌ చేశాడు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్‌లు ప్రారంభించే పరిస్థితి లేకపోవటంతో ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.