లాక్‌ డౌన్‌ సమయంలో చిన్న, పేద కళాకారులు అనేక ఇబ్బందులు పడుతుంటే పెద్ద పెద్ద స్టార్లు మాత్రం ఈ సమయాన్ని హాలీడేస్‌లా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్‌లు ప్రయాణాలతో బిజీగా ఉండే స్టార్స్‌ ఈ గ్యాప్‌లో తమ మనసుకు నచ్చిన పనులు చేస్తున్నారు. కొత్త సినిమాల కోసం కథలు వినటం. ఇప్పటికే ఓకే చేసిన కథలను మరింతగా ఫైన్‌ ట్యూన్  చేసుకోవటంతో పాటు సినిమాలు చూడటం. పుస్తకాలు చదవటం లాంటివి చేస్తున్నారు.

ఎప్పుడు షూటింగ్‌ లు లేదంటే విదేశీ ప్రయాణాల్లో ఉండే సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా లాక్‌ డౌన్‌ సమయంలో పిల్లలతో ఎంజాయ్‌  చేయటంతో పాటు తనకు నచ్చిన పుస్తకాలను తిరగేస్తున్నాడు. తాజాగా తాను ప్రముఖ రచయిత డానియల్‌ గోల్‌మెన్‌ రాసిన `ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌` అనే పుస్తకాన్ని చదువుతున్నట్టుగా అభిమానులతో పంచుకున్నాడు. తన సోషల్ మీడియా పేజ్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన మహేష్.. `ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌.. సైంటిఫిక్‌, సంచలనాత్మక రచన.. ఇది అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ వారం అంతా డానియల్‌ గోల్‌మెన్‌కే కేటాయిస్తున్నా` అంటూ ట్విటర్‌ ద్వారా అభిమానులతో షేర్  చేసుకున్నాడు మహేష్.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది మొదట్లో సరిలేరు నీకెవ్వరు సినిమాలో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్నాడు మహేష్. ఈ సినిమా భారీ విజయం సాధించటంతో తరువాత అనుకున్న వంశీ పైడిపల్లి సినిమాను పక్క పెట్టి మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో సర్కార్‌వారి పాట అనే సినిమాను ఎనౌన్స్‌ చేశాడు మహేష్. ఈ సినిమా ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.