సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్ వదిలింది. 

ఇందులో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. టెంట్ లో నుండి మహేష్ అలా నడిచొస్తున్న సీన్ హైలైట్ గా నిలిచింది. 'సరిలేరు.. నీకెవ్వరు..' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో స్పెషల్ గా ఉంటుందట.

అలానే కమెడియన్ బండ్ల గణేష్ కూడా ఈ సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. కే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.