సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ పొందింది. దుబాయ్ లో కూడా విడుదలవుతోన్న ఈ సినిమా అక్కడ కూడా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. అక్కడి సెన్సార్ బోర్డ్ సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. 'మహర్షి' సినిమాకు కూడా ఆయన రివ్యూ ఇచ్చారు.

ఈ సినిమాకు ఆయన నాలుగు స్టార్లు వేశారు. అన్ని అంశాల్లో సినిమాను అధ్బుతంగా తెరకెక్కించారని, మహేష్ బాబు తన నటనతో అబ్బురపరిచారని అన్నారు. మంచి ఎంగేజింగ్ సోషల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించినట్లు, పూజా హెగ్డే తన నటనతో ఆశ్చర్యపరిచిందని అన్నారు. పైసా వసూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని సోషల్ మీడియాలో  రాసుకొచ్చారు.

ఉమైర్ సంధు రివ్యూ మహేష్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అయితే గతంలో 'స్పైడర్' సినిమాకి కూడా ఉమైర్ సంధు నాలుగు స్టార్ల రేటింగ్ ఇచ్చారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!