బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి అతడి ప్రేయసి రియా చక్రవర్తి  సోషల్ మీడియా జనాలకి టార్గెట్ అయింది. సుశాంత్ ఆత్మహత్యకు ఆమే బాధ్యురాలు అంటూ తనపై విరుచుకుపడుతున్నారు. ఈ దాడి ఎంతకీ ఆగకపోవడంతో తాజాగా రియా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ నుంచి ఆమెకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ అయ్యాయి. నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపో.. లేదంటే రేప్ చేసి చంపేస్తా అంటూ ఆ నెటిజన్ నుంచి రియాకు బెదిరింపులు వచ్చాయి.

ఈ క్రమంలో వాటి తాలూకు స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేసిన రియా.. తాను ఎంత ఓపిక పడుతున్నప్పటికీ ఇలాంటివి బెదిరింపులు ఆగట్లేదని.. ఇలా బెదిరించే వాళ్లకు ఆ వ్యాఖ్యల తాలూకు తీవ్రత తెలుసా అని ప్రశ్నించింది. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సోషల్ మీడియా ద్వారానే ఫిర్యాదు చేసింది.  

అంతేకాదు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు సోష‌ల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసింది. త‌న‌ను అకార‌ణంగా నిందిస్తూ, ఏడిపిస్తున్నార‌ని.. సుశాంత్ మ‌రణంపై సీబీఐ ఎంక్వైరీ చేయించాల‌ని ఆమె కోరింది. ఈ విష‌యంపై కేంద్రం ఏం స్పందించ‌లేదు కానీ, మ‌హారాష్ట్ర మంత్రి  రియాక్ట్ అయ్యారు.

మ‌హారాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్పందిస్తూ రియా ఫిర్యాదుపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టుగా తెలిపారు. ఆమెను సోష‌ల్ మీడియాలో బెదిరిస్తున్న వారిపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో త‌ను మ‌హారాష్ట్ర హోం మంత్రితో మాట్లాడి, ఆమెను వేధిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకునేలా చూస్తానంటూ ఆ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండగా... రియా ఇచ్చిన కంప్లైంట్ మేర‌కు ఆమెకు అభ్యంత‌క‌ర‌మైన మెసేజ్ ల‌ను పంపిన ఇద్ద‌రు ఇన్ స్టాగ్ర‌మ్ యూజ‌ర్ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేసిన‌ట్టుగా స‌మాచారం. ఆమెను చంపుతామంటూ, ఆమెను రేప్ చేస్తామంటూ మెసేజ్ చేసిన వారిని గుర్తించి కేసులు న‌మోదు చేసే ప‌నిలో ఉన్న‌ట్టున్నారు ముంబై సైబ‌ర్ క్రైమ్ పోలీసులు.