'మెర్సల్' సినిమాకి పని చేసినందుకు తనకు రెమ్యునరేషన్ ఇవ్వలేదని కెనడాకి చెందిన మెజీషియన్ రమణ్ శర్మ ఆరోపణలుచేస్తున్నారు. ఈ విషయాన్ని చట్టపరంగా తేల్చుకుంటానని అన్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ త్రిపాత్రాభినయం చేసిన 'మెర్సల్' సినిమా 2017 అక్టోబర్ లో విడుదలైంది.

అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా కనిపించారు. ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా... ఈ సినిమాలో విజయ్  మెజీషియన్ గా కనిపిస్తారు. ఈ క్రమంలో ఆయనకు రమణ్ శర్మ అనే వ్యక్తి శిక్షణ ఇచ్చారు. మేజిక్ ఎలా చేయాలనే విషయంలో ట్రిక్స్ నేర్పించారు. 

అయితే దీనికి సంబంధించి ఇంతవరకు రమణ్ శర్మకి రెమ్యునరేషన్ ఇవ్వలేదట. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. 'మెర్సల్ నిర్మాణ సంస్థ' తనను మోసం చేసిందని.. ఆ సంస్థకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయబోతున్నట్లు వెల్లడించారు. చట్టపరంగా ఈ విషయాన్ని తేల్చుకోబోతున్నట్లు చెప్పారు.

దానికోసం కెనడా నుండి ఇండియాకు వచ్చినట్లు చెప్పారు. అంతేకాదు.. 'బిజిల్' సినిమా సెట్ లో విజయ్, అట్లీలను కలిసినట్లు కానీ ఈ వివాదం గురించి వారితో మాట్లాడడం కరెక్ట్  కాదని భావించినట్లు చెప్పారు. మరి దీనిపై 'మెర్సల్' నిర్మాణ సంస్థ తేనందల్ స్టూడియోస్ ఎలా స్పందిస్తుందో చూడాలి!