సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్‌కి వ్యతిరేకంగా నమోదైన పిటిషన్‌ని మద్రాస్ హైకోర్ట్ తాజాగా కొట్టేసింది. దీంతో రెహ్మాన్‌కి ఊరట లభించింది.
ప్రముఖ లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కి మద్రాస్ హైకోర్ట్ లో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ని కోర్ట్ కొట్టేసింది. సరైన ఆధారాలు లేవని పిటిషన్‌ని కొట్టేసింది. అసలేం జరిగిందంటే.. 2000లో ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాలియప్పన్ ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఈవెంట్‌కి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరు కాలేదు. ఈ ఈవెంట్ కోసం ఖర్చు చేసిన డబ్బు కూడా రాలేదని, రెహ్మాన్ మాత్రం లబ్ది పొందారని కాలియప్పన్ మద్రాస్ హైకోర్ట్ లో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనికిగానూ ఆయన మూడు కోట్లు చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ కేసుని శుక్రవారం న్యాయమూర్తి ఆర్ సుబ్రమణియం విచారించారు. నిర్వాహకుడికి లాభం రాకపోవడానికి తమకి ఎలాంటి సంబంధం లేదని రెహ్మాన్ తరఫు లాయర్ పేర్కొన్నారు. లాభం లేదని చెబుతూ నిర్వాహకుడు తమకి ఇస్తానని ఒప్పుకున్న డబ్బు కూడా ఇవ్వలేదని న్యాయస్థానానికి వివరించారు. అయితే దీనిపై పిటిషన్ తరఫు న్యాయవాది సరైన వివరణ ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి ఈ కేసుని కొట్టేశారు. దీంతో రెహ్మాన్‌కి ఊరట లభించింది.
