మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు, దేశ రాజకీయాలకు ముడిపెడుతూ వెలువడిన ఓ ఛానల్ కథనాన్ని ప్రకాష్ రాజ్ తన అధికారిక ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు.

ఓ తెలుగు టీవీ ఛానల్ పై నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సదరు ఛానల్ పట్ల తన అసహనం వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు, దేశ రాజకీయాలకు ముడిపెడుతూ వెలువడిన ఆ ఛానల్ కథనాన్ని ప్రకాష్ రాజ్ తన అధికారిక ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. 


ఆ ఛానల్ కథనం ప్రకారం.. మా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ పై బీజీపీ ఢిల్లీ పెద్దలు నిఘా పెట్టారట. టాలీవుడ్ కి చెందిన ఓ సీనియర్ నటుడ్ని సంప్రదించిన బీజేపీ పెద్దలు... ప్రకాష్ రాజ్ బలాబలాలు, తెర వెనకనుండి ఆయనకు మద్దతు ఇస్తున్న ప్రముఖుల గురించి రిపోర్ట్ పంపాలని ఆదేశించారట. చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వానికి, మోడీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ ఎన్నికలలో విజయం సాధించకూడదు, అనే మిషన్ లో భాగంగా బీజీపీ పెద్దలు ఇలా చేస్తున్నారట.. 


ఢిల్లీకి చేరిన 'మా' ఎన్నికల వేడి అంటూ సాగిన ఆ కథనం పట్ల ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. మీ రాజకీయాలలోకి సిని'మా' బిడ్డలను లాగకండి... అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ కథనం విషయానికి వస్తే.. 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ని ఓడించడం ద్వారా ఢిల్లీ స్థాయిలోని బీజేపీ పెద్దలకు చేకూరే ప్రయాజనం ఏమిటో అర్థం కాని విషయం. ఒక వేళ బీజేపీ వ్యతిరేకి అయిన ప్రకాష్ రాజ్ పై రివేంజ్ అనుకుంటే మాత్రం... ఓడిపోవడం వలన ప్రకాష్ రాజ్ కి వచ్చిన నష్టం ఏముంటుంది?. 


ఈ కథనాల్లో నిజం ఎంతో కానీ 'మా' ఎన్నికలకు కొందరు రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. సెప్టెంబర్ లో జరగనున్న 'మా' అధ్యక్ష ఎన్నికలలో పోటీచేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్ రాజ్... జయసుధ, సాయి కుమార్, శ్రీకాంత్, బండ్ల గణేష్, బెనర్జీ వంటి నటులతో పాటు 27మంది సభ్యులతో కూడిన ప్యానెల్ విడుదల చేశారు. 

Scroll to load tweet…