మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో అవకతవకలు జరిగాయనే విషయాలు బయటకి రావడంతో 'మా' అధ్యక్షుడు శివాజీరాజా మీడియా ముందుకొచ్చి ఎలాంటి అవకతవకలు జరగలేదని మా నిధులను దుర్వినియోగం చేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటి తరువాత జెనరల్ సెక్రటరీ నరేష్ మీడియా ముందుకొచ్చి శివాజీరాజా నిధులు దుర్వినియోగం చేశాడని ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలని నిజాలు బయటపెట్టాలని హడావిడి చేశాడు.

ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దల జోక్యం కూడా ఉందని ఆరోపణలు వినిపించాయి. ఇంత హడావిడి చేసిన వీరు ఇప్పుడు మేం కలిసిపోయాం మాకు ఎలాంటి విబేధాలు లేవంటూ ఇండస్ట్రీ పెద్దల సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి వెల్లడించారు. ఇలా చేయడం అనుమానాలకు దారి తీస్తోంది. ఇష్యూ ఇక్కడితో ముగిసిందంటూ కలిసిపోయినట్లు నటిస్తున్నారు మా సభ్యులు.

ఈ వివాదానికి సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు చెప్పకుండా జారుకున్నారు. శివాజీరాజా, నరేష్ లు కూడా ఎడ మొహం, పెడ మొహం వేసుకొని కూర్చున్నారు. బయటకి మేమంతా ఒక్కటేనంటూ కావాలని నటిస్తున్నారనే విషయం అర్ధమవుతుంది. దీనికి వెనుక చాలా కారణాలే ఉన్నాయి. అల్లు అరవింద్ గత మూడు రోజులుగా ఈ విషయంపై చర్చలు జరిపారని సమాచారం.

చిరంజీవి ఫౌండర్ చైర్మన్ కావడంతో వివాదం పెద్దది కాకుండా చూడాలని అల్లు అరవింద్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని 'మా' లో ఎలాంటి అవకతవకవలు జరగలేదని చెప్పించారు. నిజంగానే తప్పులు జరగపోతే నిజ నిర్ధారణ కమిటీ వేయొచ్చు కదా అని ప్రశ్నించగా.. మేమే కమిటీ సభ్యులమంటూ తమ్మారెడ్డి భరద్వాజా చెబుతున్నారు. ఇండస్ట్రీలో జరిగిన వివాదానికి ఇండస్ట్రీ వాళ్లని ఎలా కమిటీగా వేస్తారు.

వీరి మాటలతో జనాల్లో అనుమానాలు మరింతగా పెరిగాయి. ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగడం కోసం 'మా' సభ్యులు తిరిగి కలిసినట్లు నటిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ వివాదాల కారణంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగే అవకాశాలు లేకపోవడంతో కావాలనే పెద్దలు కల్పించుకొని మరీ సమస్య సాల్వ్ అయినట్లు చిత్రీకరిస్తున్నారు.