చిత్రం: మా అబ్బాయి న‌టీన‌టులు: శ్రీవిష్ణు, చిత్ర శుక్ల, కాశీ విశ్వ‌నాథ్‌, స‌న త‌దిత‌రులు ఛాయాగ్ర‌హ‌ణం: థ‌మ‌శ్యామ్ సంగీతం: సురేష్ బొబ్బిలి దర్శకత్వం: కుమార్ శెట్టి నిర్మాతః బ‌ల‌గ ప్ర‌కాష్ రావు ఏసియానెట్ రేటింగ్: 2.5/5
కథ...
అబ్బాయి (శ్రీవిష్ణు) ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమ్మ, నాన్న, అక్కతో కలిసి ద్వారక నగర్లో నివసిస్తుంటాడు. అక్కకి పెళ్లి కుదరడంతో అందమైన ఆ ఇంట్లో ఆనందం పరవళ్లు తొక్కుతుంది. నిశ్చితార్థం వేడుక కోసం షాపింగ్ చేసుకొని ఇంటికి తిరిగొస్తూ వస్తూ సాయిబాబా గుడికి దర్శనం కోసం వెళతారు. అక్కడ ఉగ్రవాదులు పేల్చిన బాంబులతో అబ్బాయి మినహా కుటుంబ సభ్యులంతా మరణిస్తారు. తన కుటుంబంతో పాటు ఎంతోమంది జనాన్ని బలి తీసుకొన్న ఆ ఉగ్రవాదుల్ని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకొంటాడు. అందుకోసం అతడు ఒక సైన్యంగా మారిపోయి పోరు ప్రకటిస్తాడు. మరి ద్వారక నగర్లో బాంబు అమర్చిన ఆ ఉగ్రవాదుల్ని ఎలా పట్టుకొన్నాడు? ఎలా అంతం చేశాడు? ఎదురింట్లో దిగిన ఓ కుటుంబంలోని అమ్మాయి (చిత్రశుక్ల)ని ఎంత పద్ధతిగా ప్రేమించాడన్నదే ఈ చిత్రం.
ఎలా ఉందంటే...
ఇది కొత్త కథేమీ కాదు. ఇలాంటి కథలతో తరచుగా సినిమాలు తెరకెక్కుతూనే ఉంటాయి. స్టార్ హీరోలంతా దాదాపుగా ఈ తరహా కథల్ని ఒకటికి పదిమార్లు చేసేసుంటారు. కాకపోతే ఇదివరకు హీరోలు పోలీసు అధికారి పాత్రల్లోనో లేదంటే ఇంటెలిజెన్స్ అధికారుల పాత్రల్లోనో కనిపించి కేసు చిక్కుముడిని విప్పితే.. ఇక్కడ మాత్రం ఓ బక్క పలచటి సాఫ్ట్వేర్ కుర్రాడు తానొక్కడే సైన్యంలా మారిపోయి తన ఇంటెలిజెన్సీనంతా ఉపయోగించి నేరస్థుడిని పట్టుకొంటాడు. అదే కొత్తదనం అనుకోవాలి. కథల విషయంలో మంచి అభిరుచినే ప్రదర్శించే శ్రీవిష్ణుకి ఇందులో కథానాయకుడి పాత్రలోని మేథోతనం ఆకట్టుకుంటుంది. అయితే ఆ మేథోతనం ఎన్నో కేసులు పరిశోధించిన పోలీసు అధికారులకి కూడా సాధ్యంకాని రీతిలో ఉంటుంది.
కథకి కానీ.. ఆ కథనాయకుడి తీరుకి కానీ ఏమాత్రం అతికినట్టు అనిపించదు. ఫ్లాట్గా సాగిపోయే ఈ కథలో సవాల్ ఎదురైన ప్రతిసారీ కథానాయకుడు `ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి?` అని చిటికెలు వేస్తూ కాస్త ఆలోచిస్తాడు. అంతే... ఆ వెంటనే ఐడియా వచ్చేస్తుంది. ఇక తిరుగులేదన్నట్టుగా దూసుకెళుతుంటాడు. అలా సినిమా మొత్తం కథానాయకుడు ఓ సూపర్మేన్లా కనిపిస్తుంటాడు తప్ప ఆ పాత్రతో సామాన్యులెవరూ కనెక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. లాజిక్ కు అందని రీతిలో సినిమా సాగుతుంది. సహజత్వానికి దూరంగా సాగే ఈ సినిమా ఒక పట్టాన వంట పట్టదు. ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు కరడుగట్టిన ఉగ్రవాదుల్ని ఎదురిస్తున్నాడంటే ఆ పాత్రలో ఏదైనా సంఘర్షణని చూపించాలి. కానీ హీరో కాబట్టి అలాంటివేమీ అవసరం లేదన్నట్టుగా మలిచిన హీరో పాత్ర వాస్తవానికి దూరంగా సాగుతుంటుంది. గుడి ఆవరణంలో బాంబులు పేలడంతో కథలో వచ్చిన మలుపే తప్ప ఆ తర్వాత ఎక్కడా ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేసే అంశాలు లేకపోవడం ఈ సినిమాకి ప్రధానమైన మైనస్. కథానాయకుడి పాత్రని తీర్చిదిద్దిన విధానం మరో మైనస్. తొలి సగభాగంతో పోలిస్తే ద్వితీయార్థం పర్వాలేదనిపిస్తుంది. సినిమా ఆరంభం మొదలుకొని అడుగడుగునా వచ్చి పడిపోయే పాటలు కథకి అడ్డు పడుతుంటాయి.
నటీనటులు...
సినిమా మొత్తం శ్రీవిష్ణుపైనే సాగుతుంది. ఒక మాస్ కథ, పాత్ర చేసేటప్పుడు కథానాయకుడి బాడీ లాంగ్వేజ్కి అందుకు తగ్గట్టుగానే ఉండాలి. కానీ శ్రీవిష్ణు మాత్రం ఇదివరకటి సినిమాల్లాగే సాదాసీదాగా కనిపించాడు. ఇందులో డ్యాన్సులు, ఫైట్లు మాత్రం బాగా చేశాడు. చిత్రశుక్ల అందంగా కనిపించింది. పాటల్లో హుషారుతనం కనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవల్సినంతేమీ లేదు. సాంకేతికంగా మాత్రం ఈ సినిమాకి మంచి మార్కులు పడతాయి. థమ శ్యామ్ కెమెరా పనితనం, సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు కనిపిస్తాయి. ఎడిటింగ్ విభాగం నుంచే వచ్చిన దర్శకుడు ఆ విషయంలోనే దృష్టి పెట్టలేకపోయాడు. దాంతో అసందర్భంగా పాటలు, సన్నివేశాలు వచ్చేయటం ఇబ్బందికరంగా ఉంటుంది.
ప్లస్ పాయింట్స్...
నిర్మాణ విలువలు, హీరోయిన్ అందాలు, పోరాట సన్నివేశాలు
మైనస్ పాయింట్స్...
కథనం, సాగదీత సన్నివేశాలు
చివరగా... "మా అబ్బాయి" రోటీన్ గానే ఉన్నాడు.
