ఓ సినిమా హిట్టైందంటే మొదట అందులో నటించిన హీరో, వెంటనే ఆ సినిమాని డైరక్ట్ చేసిన దర్శకుడు బిజీ అవుతారు. ఇప్పుడు కన్నడ చిత్రం కేజీఎఫ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో అందరి దృష్టీ ఆ సినిమాపై పడింది. దానికి తోడు యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం కొన్నాళ్లుగా టాప్ లెవల్లో ట్రెండింగ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో, సరికొత్త పాయింట్ తో తెరకెక్కిన కేజీఎఫ్ మూవీ శుక్రవారం నాడు రిలీజ్ అయ్యింది ..మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమాతో పాటే రిలీజ్ అయిన తెలుగు సినిమాలని ఎవరూ పట్టించుకోవటం లేదు. దాంతో ఫిల్మ్ సర్కిల్స్ లో  ఎక్కడ చూసినా కేజీఎఫ్ గురించే చర్చించుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. హీరో గెటప్ నుంచి ట్రయిలర్ వరకు ప్రతిదీ సంచలనం సృష్టించటం హీరోలకు నచ్చేసింది.  దాంతో ఆ డైరక్టర్ తో సినిమా చెయ్యటానికి అంతా ఉత్సాహం చూపిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సైతం ఈ డైరక్టర్ చేద్దామని ఫిక్స్ అయ్యాడట. దాంతో యువి క్రియేషన్స్ రంగంలోకి దిగి ఆ డైరక్టర్ ని లాక్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. 

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో కొన్ని దశాబ్దాల క్రితం ఏంజరిగింది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఇందులో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చీరావడంతోనే సంచనాలకు తెరలేచింది. అక్కడి నుంచి తెలుగు టాప్ డైరక్టర్ రాజమౌళి కూడా ఈ సినిమా గురించి ఆసక్తి చూపించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా ట్రయిలర్ కోటి వ్యూస్ దాటిపోయింది. దాంతో రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వాళ్లకు పండగలా సినిమా అనిపించింది. 

కర్ణాటకలో 500 థియేటర్లు, తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో 350 థియేటర్లు, తమిళంలో 150, కేరళలో 75, హిందీ వెర్షన్ లో 1000 థియేటర్లలో ఈ చిత్రాని రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్ కూడా మాంచి జోరుగా ఉన్నాయి. విడుదల రోజే కాదు, మరో వారం రోజుల వరకు టికెట్లన్నీ బుక్కయిపోవడం కేజీఎఫ్ పై ప్రేక్షకుల్లో ఎంతటి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో చెబుతోంది. ఏ సెంటర్లుగా భావించే మల్టీప్లెక్స్ ల్లో కూడా కేజీఎఫ్ టికెట్లు దొరకడంలేదంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రబాస్ మనసు పడ్డాడని అర్దమవుతోంది.