`లైగర్` సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేపట్టారు. `ఆచార్య` సినిమాకి చిరంజీవి భారీగా తిరిగి ఇచ్చారని, తమకి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
`లైగర్` సినిమా నష్టాలు ఇంకా దర్శకనిర్మాత పూరీని వెంటాడుతుంది. ఇది నెమ్మదిగా విజయ్ దేవరకొండకి కూడా తగులుతుంది. ఈ సినిమా విడుదలై దాదాపు తొమ్మిది నెలలు పూర్తయ్యింది. తాజాగా పూరీ తన కొత్త సినిమాని ప్రకటించారు. రామ్‌తో `ఇస్మార్ట్ శంకర్`కి సీక్వెల్ `డబుల్ ఇస్మార్ట్`ని అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో `లైగర్` డిస్ట్రిబ్యూటర్లు నిరసన చేపడుతున్నారు. తమని ఆదుకోవాలని, తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటున్నారు. ఎంతో కొంత రిటర్న్ చేసి తమని ఆదుకోవాలని వారు ఆందోళన చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆచార్య` చిత్రం గతేడాది విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా భారీగా నష్టపోయింది. కొన్ని డిస్ట్రిబ్యూటర్లు రోడ్డునపడ్డారు. దానికి దర్శకుడు కొరటాల శివ పూర్తి బాధ్యత తీసుకున్నారు. అయితే, చిరంజీవి, రామ్‌చరణ్ కూడా తమవంతు సహాయాన్ని అందించారట. వాళ్లు 13కోట్లు వెనక్కి ఇచ్చారని, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకున్నారని తెలిపారు.
నైజాం డిస్ట్రిబ్యూటర్‌కి 13కోట్లు ఇచ్చారని, ఏపీ డిస్ట్రిబ్యూటర్లకి ఎనిమిది కోట్లు వెనక్కి ఇచ్చారట. మొత్తంగా చిరు,చరణ్ ఇరవై కోట్ల వరకు పారితోషికం వెనక్కి ఇచ్చారని సమాచారం. నష్టాలు వచ్చిన ప్రతిసారి ఎంతో కొంత వెనక్కి ఇచ్చి ఆదుకుంటున్నారట. అలాగే పూరీ జగన్నాథ్ చేయాలని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఎంతో కొంత ఆదుకోవాలని, సగంలో సగమైనా ఇవ్వాలి కదా అండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. చిరంజీవి, చరణ్‌ల పేర్లు లాగారంటే ఇప్పుడు విజయ్ దేవరకొండని కూడా ఇందులోకి లాగుతున్నారని అర్థమవుతుంది. మరి దీన్ని దర్శక, నిర్మాత పూరీ ఎలా సెటిల్ చేస్తారో చూడాలి.
రామ్ మూవీ `డబుల్ ఇస్మార్ట్` ప్రకటించిన సందర్బంగా డిస్ట్రిబ్యూటర్లు నిరసన తెలియజేయడంతో అది కొత్త సినిమాపై ప్రభావం పడుతుంది. ఆ ఉద్దేశ్యంతోనే డిస్ట్రిబ్యటర్లు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా `లైగర్` సినిమా నష్టాలు ఇంకా వదలడం లేదనిపిస్తుంది.
