సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ లోని చీకటి కోణాలను తెర మీదకు తీసుకువచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్‌ లో నెపోటిజం (వారసత్వం) కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖలు నెపోటిజంపై గళమెత్తుతున్నారు. తాజాగా ఒకప్పటి స్టార్ యాక్టర్‌ ఇందర్‌ కుమార్‌ భార్య పల్లవి కుమార్‌ కూడా స్పందించారు.

90స్‌లో స్టార్‌ యాక్టర్‌ పేరు తెచ్చుకున్న ఇందర్‌ కుమార్‌ చనిపోయే సమయానికి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డాడని పల్లవి తెలిపారు. నెపోటిజం కారణంగానే ఆయనకు అవకాశాలు దక్కలేదని ఆమె వెల్లడించారు. ఇందర్‌ కుమార్‌.. తుమ్‌కో నా భూల్‌ పాయేంగే, కహీ ప్యార్‌ నా హో జాయే, ఖిలోడియోంకా ఖిలాడీ సినిమాల్లో నటించాడు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉండగా 2017లో 43 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించాడు.

అయితే చనిపోయే ముందు తన భర్త ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించింది. `ప్రస్తుతం అంతా నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు, నాకు బాగా గుర్తు, నా భర్త చనిపోయే ముందు ఇండస్ట్రీలో ఇద్దరు ప్రముఖులను కలిశారు. తనకు అవకాశాలు ఇప్పించాలని కోరారు. కరణ్ జోహార్‌ను కలిసేందుకు వెళితే ఆయన రెండు గంట పాటు వెయిట్ చేయించిన తరువాత మేనేజర్‌ వచ్చి కరణ్‌ బిజీగా ఉన్నాడని చెప్పారు. ఆ తరువాత షారూఖ్‌ ఖాన్‌ కూడా అలాగే అవకాశం ఇప్పిస్తానని తరువాత కుదరదని చెప్పారు. నా భర్త కూడా ఓ స్టార్‌, ప్రతిభ ఉన్నవాడు. మరెందుకు ఆయనకు అవకాశం ఇవ్వలేదు? నెపోటిజాన్ని ఇకనైన అడ్డుకోండి` అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.