ముంబై:  రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాలని తలపెట్టిన లక్ష్మీస్ పార్వతి తెరమరుగైందనే అందరూ అనుకుంటున్నారు. ఈ తరుణంలో రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు ఆయన గతంలో ప్రకటించారు. ఆ తర్వాత ఇతర వివరాలేవీ ఆయన వెల్లడించలేదు.


 

ముంబైకి చెందిన ఎంటర్ ప్రెన్యూర్ బాలగిరికి చెందిన జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందిస్తామని, ఈ విజయదశమికి సినిమా స్టార్ట్ చేసి జనవరి చివరికల్లా సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని ఆర్జీవి తెలిపాడు. అక్టోబర్ 19న పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా అన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్, లక్ష్మిపార్వతి, చంద్రబాబు నాయుడు లతో కూడిన పాత పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

 

 

ఎన్టీఆర్ ట్రూ స్టోరీ అనే హ్యాష్‌‌ట్యాగ్ జోడించి ఆ విషయాన్ని ఆయన పోస్టు చేశారు.  నందమూరి బాలకృష్ణ తన స్వీయ నిర్మాణంలో ఎన్టీఆర్ పేరుతో రెండు భాగాలుగా తన తండ్రి బయోపిక్ రూపొందించే పనిలో పడిన విషయం తెలిసిందే. 

క్రిష్ దర్శకత్వంలో ఆ సినిమా నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఆ సినిమాకు సంబంధించి రోజుకో విధమైన స్టిల్ ను బయటపెడుతూ ఆసక్తి పెంచుతున్నారు. ఈ సమయంలోనే ఆర్జీవి తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడడం ద్వారా మరోసారి ఉత్కంఠకు తెర తీశారు.

 

తొలిసారి సినిమాకు ముహూర్తం ఖరారు చేసుకుని ప్రారంభిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రమేనని, అది కూడా బాలాజీ పాదాల చెంత తిరుపతిలో ప్రారంభిస్తున్నానని, ఎన్టీఆర్ పై గౌరవంతో ఆ పనిచేస్తున్నానని కూడా ఆయన ట్వీట్ చేశారు 

ఇది చూడండి: పెళ్లికి ఎన్టీఆర్ ఎలా ప్రపోజ్ చేశాడంటే.... (లక్ష్మీపార్వతితో ప్రత్యేక ఇంటర్వ్యూ)