హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్ గా ప్రసారమయ్యే `కౌన్‌ బనేగా కరోడ్‌పతి`(కేబీసీ) షో ఎంతగా పాపులర్‌ తెలిసిందే. హిందీలో క్లిక్‌ అవ్వడంతో ఇది దక్షిణాదికి కూడా పాకింది. అయితే ఇన్నాళ్ళు హోస్ట్ గా చేస్తున్న అమితాబ్‌ బచ్చన్‌ని షాక్‌కి గురి చేసింది ఓ యువతి. కేబీసీ రియాలిటీ షోటో కంటెస్టెంట్‌గా పాల్గొన్న యువతి ఓ విచిత్రమైన సంఘటన చెప్పి అమితాబ్‌ని హేట్‌చేసింది. తనకి నచ్చలేదని అందరి ముందే నిర్మొహమాటంగా చెప్పింది. దీంతో ఆమె చెప్పిన రీజన్‌ విని బిగ్‌బీ ఖంగుతిన్నారు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. 

ప్రస్తుతం కేబీసీ 12వ సీజన్‌ కొనసాగుతుంది. ఇందులో తాజాగా ఢిల్లీకి చెందిన రేఖారాణి అనే యువతి పాల్గొంది. ఆమె సివిల్‌ సర్వీస్‌కి ప్రిపేర్‌ అవుతుండటం విశేషం. అయితే ఆమె షారూఖ్‌ ఖాన్‌కి పెద్ద అభిమాని. తమ అభిమాన నటుడిని అమితాబ్‌ కొన్ని సినిమాల్లో తిట్టాడట. దురుసుగా ప్రవర్తించాడట. `కభీ ఖుషీ కభీ ఘమ్‌` చిత్రంలో ఏకంగా షారూఖ్‌ని ఇంటి నుంచి పంపించారని ఆమె ఆరోపించింది. 

ఇలా ఆ యువతి చెప్పిన కారణానికి అమితాబ్‌ అవాక్కయ్యారు. ఆ క్షణం ఆయనకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అది కేవలం నటన అని, దర్శకుడు చెప్పిన దాని ప్రకారం, స్క్రిప్ట్ ప్రకారమే అలా చేస్తామని, రియల్‌ లైఫ్‌లో అలా ఉండమని అమితాబ్‌ చెప్పాడు. కానీ ఆమె ససేమిరా అన్నది. చివరకు అమితాబ్‌ ఆమెకి సారీ చెప్పాడు. అంతేకాదు షారూఖ్‌ కూడా క్షమాపణలు చెబుతానని చెప్పాడు. సినిమాల ప్రభావం జనాలపై ప్రభావం చూపుతాయనేదానికిది ఉదాహరణగా నిలిచింది. మరోవైపు తన నటనని అంత సహజంగా పండినందుకు, వాళ్ల మనసుల్లోకి వెళ్ళినందుకు లోలోపల బిగ్‌బీ సంతోషించారు.