తిరుపతిలో బిచ్చగత్తెగా మారిన స్టార్ లేడీ కమెడియన్!
ఒకప్పటి స్టార్ లేడీ కమెడియన్ వాసుకి బిచ్చగత్తెగా మారింది. తిరుపతిలో దుకాణాల ముందు ఆడుకుంటున్న ఆమెను కొందరు గుర్తించి ఆశ్చర్యపోయారు.

చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్స్ దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. దానికి పరిశ్రమలో ఉన్న దోపిడీ వ్యవస్థే కారణం. హీరో, డైరెక్టర్, హీరోయిన్ తో పాటు కొద్ది మంది ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కోట్లకు కోట్లు తీసుకుంటూ మిగతా ఆర్టిస్ట్స్ కి నామ మాత్రపు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. భరోసా లేని కెరీర్లో ఆఫర్స్ వచ్చినన్నాళ్లే వెలుగు. రోజుకు వేలలో సంపాదించే ఆర్టిస్ట్స్ కి ఆర్థిక భద్రత ఉండదు. వందల చిత్రాల్లో నటించిన రమాప్రభ, శ్రీలక్ష్మితో పాటు పలువురు ఆర్టిస్ట్స్ ప్రస్తుతం కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు. చెప్పాలంటే అసహాయ ఆర్టిస్ట్స్ లిస్ట్ పెద్దదే.
అలాంటి వాళ్లలో పాకీజా అలియాస్ వాసుకి ఒకరు. వాసుకి ఈ తరం ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. 90లలో లేడీ కమెడియన్స్ లో ఒకరిగా ఆమె సత్తా చాటారు. అసెంబ్లీ రౌడీ మూవీలో వాసుకి చేసిన పాకీజా పాత్ర అప్పట్లో ట్రెండ్ సెట్టర్. ఆ ఒక్క సినిమా వాసుకికి తెలుగులో విపరీతమైన ఫేమ్ తెచ్చింది. టాలీవుడ్ లో ఆమె పేరు స్థిరపడిపోయింది. వాసుకి అంటే ఎవరికీ తెలియదు కానీ, పాకీజా అంటే టక్కున నవ్వులు పూస్తాయి.
తమిళంలో ఎక్కువగా నటించిన వాసుకి 250కి పైగా చిత్రాలు చేశారు. ఆమె ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కనీసం తినడానికి తిండి లేదు. షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యానికి డబ్బులు లేవు. ఓ యూట్యూబర్ ఆమె దీనగాథ వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆమెకు టాలీవుడ్ నుండి కొంత సహాయం అందింది. తన సొంత పరిశ్రమ కోలీవుడ్ పట్టించుకోలేదని ఆమె వాపోయారు. మంచు విష్ణు ఆమెకు మా కార్ట్ ఇప్పించారు. అలాగే మెగా ఫ్యామిలీ ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం.
అయినా ఆమె ఆర్థిక ఇబ్బందులు తీరినట్లు లేదు. ఏకంగా భిక్షాటన చేస్తూ తిరుపతిలో కనిపించింది. అక్కడ దుకాణాల ముందు ఆమె భిక్షాటన చేస్తుండగా కొందరు గుర్తించారు. దీంతో ఆమె పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్న వాసుకీ ఇంటి అద్దె కూడా చెల్లించలేక అడుక్కుంటున్నారట. కొద్దిరోజుల క్రితం ఆమె జబర్దస్త్ లో మెరిశారు. ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో ఆమె రైజింగ్ రాజుతో పాటు స్కిట్ చేశారు.