చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా’ ప్రీ రిలీజ్‌ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హాజరుకానున్నారని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్‌, ట్రైలర్‌ విడుదల వేడుక ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున జరగనుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సురేందర్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా గురువారం ప్రకటించారు. . అయితే అలా ప్రకటించిన కొద్ది సేపటికే.. కేటీఆర్ ఈ వేడుకకు రావడం లేదని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధికార ట్విట్టర్‌లో తెలిపారు.

‘‘సైరా ప్రీ రిలీజ్ మరియు ట్రైలర్ విడుదల కార్యక్రమానికి కేటీఆర్‌గారు రావడం లేదు. అధికారిక పనులతో బిజీగా ఉండటం వల్లనే ఆ రోజు కేటీఆర్‌గారు ఈ వేడుకకు రావడం లేదు..’’ అని కొణిదెల పీఆర్వో అఫీషియల్ గా ట్విట్టర్‌లో ట్వీట్ చేసారు.
 
 మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.   శ్రీమతి సురేఖ సమర్పిస్తున్నారు. రామ్‌చరణ్‌ కొణిదెల నిర్మిస్తున్నారు. ‘సైరా’ నరసింహారెడ్డిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రధారులు.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిందీలో రూ.45 కోట్లు బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి రూ.40 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.