`భీమ్లా నాయక్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఈ నెల 21న సోమవారం సాయంత్రం నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ ఈవెంట్‌కి గెస్ట్ ఎవరుస్తున్నారో వెల్లడించింది.

పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan), రానా(Rana) కలిసి నటించిన మల్టీస్టారర్‌ `భీమ్లానాయక్‌`(Bheemla Nayak) మరో వారం(ఫిబ్రవరి 25)లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది యూనిట్‌. పవన్‌ కళ్యాణ్‌ నటించిన సినిమాకి ప్రత్యేకంగా ప్రమోషన్‌ కార్యక్రమాలు అవసరం లేదు. జస్ట్ సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ ఇస్తే సరిపోతుంది. అవే రెండు రోజులపాటు ట్రెండ్‌ అవుతుంటాయి. కానీ హైప్‌ తీసుకురావడానికి ఓ ఈవెంట్‌ కచ్చితంగా అవసరం అవుతుంది. పవన్‌ ఆడియెన్స్ ని కనువిందు చేసేందుకు ఓ ఈవెంట్‌ కావాలి. అందుకే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని వేదికగా చేస్తుంటారు. 

Bheemla Nayak ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఈ నెల 21న సోమవారం సాయంత్రం నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ ఈవెంట్‌కి గెస్ట్ ఎవరుస్తున్నారో వెల్లడించింది. తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు వెల్లడించింది. `భీమ్లా నాయక్‌`కి మాటలు, స్క్రీన్‌ ప్లే అందించిన దర్శకుడు త్రివిక్రమ్‌, చిత్ర నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) కలిసి మంత్రి కేటీఆర్‌ని శనివారం మధ్యాహ్నం కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసి `భీమ్లా నాయక్‌` ఈవెంట్‌కి గెస్ట్ గా రావాలని కోరగా, ఆయన వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం విశేషం. 

Scroll to load tweet…

కేటీఆర్‌ గెస్ట్ గా వస్తున్నారనే వార్తతో `భీమ్లానాయక్‌`కి హైప్‌ మరింతగా పెరుగుతుందనే చెప్పాలి. అయితే పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు ప్రత్యేకమైన గెస్ట్ లు అవసరం లేదు. ఆయన కోసమే అభిమానులు వెయిట్‌ చేస్తుంటారు. ఎప్పుడైనా అవసరమైతే అన్నయ్య చిరంజీవిని గెస్ట్ గా పిలుస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం రాజకీయ నాయకుడిని గెస్ట్ గా పిలవడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో హాట్‌ టాపిక్‌గానూ మారుతుంది. దీనికి సంబంధించిన సోషల్‌ మీడియాలో కొత్త చర్చకు తెరలేపుతుంది. 

రేపు(ఫిబ్రవరి 20) ఏపీలో పవన్‌ పొలిటికల్‌ మీటింగ్‌ ఉంది. ఇందులో ఏపీలో టికెట్ల రేట్ల విషయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై పవన్‌ ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకి, థియేటర్ల విషయంలో, టికెట్‌ రేట్ల విషయంలో అనుకూలంగా ఉంది. కానీ ఏపీ లేకపోవడంతో తెలంగాణని చూపిస్తూ ఏపీ ప్రభుత్వానికి పవన్ చురకలంటించాలనుకుంటున్నట్టు టాక్‌. అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి పవన్‌ బద్ద శత్రువుగానూ మారారని, పవన్‌ సినిమా విడుదల ఉందనే ఉద్దేశ్యంతో టికెట్ల రేట్లకి సంబంధించి జీవోని విడుదల చేయడంలో ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఊహాగానాలు, రూమర్స్ వినిపిస్తున్నాయి. 

ఇలా `భీమ్లా నాయక్‌`కి నష్టం చేయాలనే ధోరణిలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో, అటు ఫిల్మ్ నగర్‌లో, ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్‌ సినిమాకి తెలంగాణ మంత్రిని గెస్ట్ గా ఆహ్వానించడం మరింత చర్చనీయాంశంగా మారింది. తన సినిమా ఈవెంట్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జగన్‌ ప్రభుత్వాన్ని పవన్‌ టార్గెట్‌ చేస్తారా? అనే చర్చ మొదలైంది. దీంతో సోమవారం సాయంత్రం `భీమ్లా నాయక్‌` ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్‌ ఏం మాట్లాడబోతున్నారనే ఇంట్రెస్ట్ గా మారింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

ఏదేమైనప్పటికీ మంత్రి కేటీఆర్‌ గెస్ట్ గా అనే వార్తతో పవన్‌ ఫ్యాన్స్ ఆనందాల్లో మురిసిపోతున్నారు. ఇక పవన్‌, రానా కలిసి నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్రానికి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ మాటలు, కథనం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌కి జోడిగా నిత్యా మీనన్‌, రానాకి జోడీగా సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. హిందీలోనూ విడుదల చేయబోతున్నారు.