నాగచైతన్య. హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కస్టడీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కృతిశెట్టి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయితేనేం కృతికి కలిసొచ్చింది. ఎలాగంటే..
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే అందరి చూపును తన వైపు తిప్పుకుంది. ముఖ్యంగా యూత్‌లో ఈమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌తోనే వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఉప్పెన రిలీజైన ఏడాదిలోపే అరడజను సినిమాలు ఓకే చేసింది. గతేడాది సెకండ్ హీరోయిన్‌గా చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాల తప్పించి ఏదీ క్లిక్ కాలేదు. అయితే ఆ సినిమా ఆమె కెరీర్ కు ఉపయోగపడేది కాదు. హీరోయిన్‌గా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సెకండ్ హీరోయిన్‌గా చేయడంపై పలు విమర్షలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో కృతి పోషించిన రోల్ కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు అని అన్నారు. ఈ సినిమా తర్వాత కృతి హీరోయిన్‌గా చేసిన నాలుగు సినిమాలు రిలీజైయ్యాయి. వాటిలో మూడు డిజాస్టర్‌లు కాగా, ఒకటి జస్ట్ ఓకే అనిపించుకుంది. తాజాగా ఆమె నాగచైతన్య సరసన చేసిన కష్టడీ చిత్రం సైతం డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమా వల్ల ఆమెకు ఓ ఆఫర్ మాత్రం కలిసొచ్చింది.
కష్టడీ తర్వాత కృతి శెట్టికి ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.తమిళ హీరో విజయ్ సినిమాలో కృతి శెట్టికి ఛాన్స్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు వెంకట ప్రభు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ లో విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉంది. అందులో ఒకరిగా కృతి శెట్టిని ఎంచుకున్నట్లు సమాచారం. కష్టడీ సమయంలో వెంకట్ ప్రభు కు ఆమె నటన నచ్చి ..తమిళంలో ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృతి ఒక మలయాళ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. సూర్య-బాలా ప్రాజెక్ట్‌లో కూడా ఈమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయింది.
ఇక రీసెంట్ గా విజయ్- వెంకట్ ప్రభు కాంబోకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడింది. #thalapathy68 వర్కింగ్ టైటిల్‌తో చిత్రాన్ని ప్రకటించిన వెంకట్ ప్రభు.. ‘విజయ్‌తో సినిమా చేయాలనే నా కల నిజమైంది’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఓ వీడియో ద్వారా దర్శక, నిర్మాతలు, హీరో, సంగీత దర్శకుడి వివరాలను పజిల్‌లో చూపించిన తీరు సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కళపతి ఎస్. అఘోరం నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్‌రాజా సంగీతం అందించనున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలోని హీరోయిన్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. వెంకట్ ప్రభు గత చిత్రాల్లానే ఈ సినిమా కూడా విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందబోతున్నట్టు తెలుస్తోంది.
విజయ్ ప్రస్తుతం ‘లియో’ (Leo) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. త్రిష కథానాయిక. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 19న విడుదల కానుంది. సూర్య ‘రాక్షసుడు’, శింబు ‘ది లూప్’ తదితర డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వెంకట్ ప్రభు నాగచైతన్య హీరోగా నేరుగా తెలుగు సినిమా (కస్టడీ) తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
