గమ్యం, వేదం, కంచె సినిమాలతో విలువలున్న దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాతో బాలీవుడ్ లో కమర్షియల్ దర్శకుడిగా కూడా తన రేంజ్ ని పెంచుకున్నాడు. ఇక గౌతమి పుత్ర శాతకర్ణి - మణికర్ణిక సినిమాలతో హిస్టారికల్ భారీ బడ్జెట్ చిత్రాలను సైతం స్పీడ్ గా తెరకెక్కించగలనని నిరూపించాడు.

అయితే గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ (కథానాయకుడు - మహానాయకుడు) తో మాత్రం క్రిష్ ఊహించని అపజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా ఏ మాత్రం సక్సెస్ కాకపోయినప్పటికీ క్రిష్ డిమాండ్ తగ్గలేదు. ఎప్పటిలానే స్టార్ హీరోలు అతన్ని పిలిపించుకొని మరీ కథలు వింటున్నారు. ఇక మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చిన క్రిష్ మరో మెగా హీరోతో కూడా ముందే మరొక కథను ఒకే చేయించుకున్నట్లు తెలుస్తోంది.

ఆ హీరో మరెవరో కాదు. యువ హీరో వరుణ్ తేజ్. గతంలో క్రిష్ వరుణ్ తో కంచె సినిమా తీసి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. దీంతో మరొక సినిమా చేయాలనీ ఎప్పటినుంచో వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైనల్ గా ఇటీవల క్రిష్ చెప్పిన కథకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్సినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా అయిపోయిన తరువాత వరుణ్క్రిష్ తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ మెగా హీరో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు.