రవితేజ సరైన హిట్ అందుకొని చాలా కాలం అవుతుంది. ఏ హీరో కెరీర్ మైలేజ్ అయినా... హిట్ చిత్రాలపైనే ఆధారపడి ఉంటుంది. కనీసం రెండేళ్లకు ఒక హిట్టైన అందుకోకపోతే నిర్మాతలు, దర్శకులు పట్టించుకోవడం మానేస్తారు. సరిగ్గా అదే పరిస్థితికి రవితేజ కెరీర్ చేరింది. 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ తరువాత రవితేజ నటించిన నేల టికెట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోని మరియు డిస్కో రాజా ప్లాప్స్ గా నిలిచాయి. 

డిస్కో రాజా సినిమాకు ముందు కూడా రవితేజ వరుస ప్లాప్స్ అందుకోవడం జరిగింది. 2013లో వచ్చిన బలుపు తరువాత రవితేజ క్లీన్ హిట్ కొట్టలేదు. రాజా ది గ్రేట్ మూవీ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్ ఇక ఢమాల్ అనుకున్నారు. ఫేడ్ ఔట్ హీరో మాదిరి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకోకతప్పదన్న వాదన గట్టిగా వినిపించింది. దీనితో కలిసొచ్చిన దర్శకుడితో రవితేజ క్రాక్ మూవీని కసిగా చేశాడు. 

2013లో తనకు బలుపు పేరుతో బిగ్ హిట్ ఇచ్చిన గోపి చంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ నిన్న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో క్రాక్ సంక్రాంతికి వచ్చిన ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా క్రాక్ మూవీతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కాడని, మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యాడని అంటున్నారు. క్రాక్ ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకున్న క్రాక్ మూవీ విడుదల రోజు నిర్మాత,దర్శకుడిని టెన్షన్ పెట్టింది. మొత్తంగా మూవీకి హిట్ టాక్ రావడంతో రవితేజతో పాటు చిత్రం యూనిట్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.