ఎవరి పని వాళ్ళు చేయాలనేది పెద్దలు చెప్పిన నీతి. మనకు సంబంధం లేని విషయాల్లో ఏలు పెడితే చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం కలదు. ప్రస్తుతం కొరటాల పరిస్థితి కూడా ఇదే.
ఆచార్య(Acharya) మూవీ డిజాస్టర్ కాగా బయ్యర్లు వంద కోట్ల వరకు నష్టాలు చవి చూశారు. తాజాగా సీడెడ్ బయ్యర్లు కొరటాల ఇంటి ముందు బైఠాయించారు. రూ. 15 కోట్ల నష్టానికి ఎంతో కొంత తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏకంగా చిరంజీవి ఇంటి మూడు ధర్నాకి దిగుతామంటూ హెచ్చరించారు. ఇప్పటికే ఆచార్య నష్టాలను పూడ్చడం కోసం కొరటాల సొంత ఆస్తులు బేరం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగేళ్లు ఆచార్య కోసం కేటాయించిన కొరటాల కనీసం రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా... నిర్మాతగా మారి ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు.
ఆచార్య మూవీ చిరంజీవి(Chiranjeevi) ఓన్ ప్రొడక్షన్ హౌస్ కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మించింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అనేక కారణాలతో సినిమా ఆలస్యం కాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో కొరటాల వాళ్ల షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారట. ఇక సినిమాపై విడుదల ముందు నుండే నెగిటివ్ టాక్ నడిచింది. రీషూట్స్ చేయడం, హీరోయిన్ కాజల్ పాత్రను ఎత్తేయడం వంటి విషయాలు సినిమాపై ప్రతికూల ప్రభావం చూపాయి.
ఇక ఫస్ట్ షో నుండే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఆచార్య రెండో రోజే థియేటర్స్ నుండి తీసేసే పరిస్థితి ఏర్పడింది. రూ. 130 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య కనీస వసూళ్లు అందుకోలేదు. దర్శకుడైన కొరటాల(Koratala Shiva) నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నాడు. ఈ మధ్య చాలా మంది స్టార్ డైరెక్టర్స్ నిర్మాతలుగా మారుతున్నారు. తాము డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం తీసుకుంటున్నారు. ఎటూ చేసేది స్టార్ హీరోతో మూవీ కాబట్టి ఫలితంతో సంబంధం లేకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే కోట్లు రాబట్టవచ్చని భావిస్తున్నారు.
వాళ్ళ రెమ్యూనరేషన్ తో పాటు సినిమాలో వాటా ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. ఐతే వాళ్ళ ప్రణాళిక ప్రతిసారి ఫలితం ఇవ్వదని, ఆచార్య లాంటి సినిమా పడితే పాతాళానికి వెళ్లిపోవాల్సి ఉంటుందని ఇప్పుడు తెలిసొచ్చింది. కాబట్టి మన స్టార్ డైరెక్టర్స్ నిర్మాణం వదిలేసి మెరుగైన సినిమాలు చేయడంపై దృష్టి పెడితే వాళ్ళ కెరీర్ గ్రాఫ్ పెరుగుతుంది. అదే సమయంలో ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకుండా పోతుంది. లేదంటే కొరటాల మాదిరి ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న మొత్తం ఒక్క సినిమాతో పోతుంది.