ద‌ర్శ‌కురాలు సంజ‌నా రెడ్డి అస్వ‌స్థ‌త‌కు గురై.... హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఆమె చికిత్స పొందుతున్న‌ట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరికొంతరు ఓ అడుగు ముందుకేసి ఈ రోజు ..ఆమె ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారని కొందరు ప్రచారం చేయటం మొదలెట్టారు.ఈ విషయమై ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.

కోన వెంకట్ తన ట్వీట్ లో  'మా కరణం మల్లేశ్వరి బయోపిక్ దర్శకురాలు సంజనా రెడ్డి పూర్తిగా బాగున్నారు. కొన్ని రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. వైరల్‌ ఫీవర్‌ రావడంతో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. దయచేసి ఆమెపై వస్తోన్న ఊహాగానాలకు ఇక ముగింపు పలకాలని కోరుతున్నాను' అని కోన వెంకట్ అన్నారు. ఇటీవల ఆమెపై వచ్చిన వార్తలకు ఆయన చెక్‌ పెట్టే ప్రయత్నం చేసారు.

ఇక  పాత్రికేయురాలిగా త‌న ప్ర‌యాణం ప్రారంభించిన సంజ‌న‌  రాజ్ త‌రుణ్‌తో `రాజుగాడు` సినిమాతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కొంత గ్యాప్  తీసుకుని ఇప్పుడు క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ ని తెర‌పై తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.   కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ నిర్మించనున్నారు. శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామం నుంచి దేశానికి తొలి ఒలింపిక్‌ పతాకాన్ని తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరి కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చిత్రబృందం భావించిందట. సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. 

ఈ సినిమాలో మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రారంభ‌మైంది. ఈలోగా ఆమె అస్వ‌స్థ‌త‌కు గుర‌‌య్యారు.