నాగార్జున షూటింగ్‌ మొదలు పెట్టాడు. దాదాపు ఆరు నెలలుగా కరోనా వల్ల సినిమా చిత్రీకరణలు ఆగిపోయిన నేపథ్యంలో ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతులిచ్చింది. కరోనా జాగ్రత్తలతో సినిమా చిత్రీకరణలు జరుపుకోవచ్చని పేర్కొంది. దీంతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల్లో నాగ్‌ ముందుగా బరిలోకి దిగారు. షూటింగ్‌లు రీస్టార్ట్ చేశారు. 

ఆయన ఇప్పటికే `బిగ్‌బాస్‌ 4` షూటింగ్‌ని ప్రారంభించి, మిగతా సీనియర్‌ హీరోలకు, యంగ్‌ స్టర్స్ కి ఆదర్శంగా నిలిచారు. తాజాగా గురువారం తాను నటిస్తున్న `వైల్డ్ డాగ్‌` షూటింగ్‌ని ప్రారంభించారు. ఈ మేరకు నాగ్‌ ఓ స్పెషల్‌ వీడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. అందులో నాగ్‌ లోకేషన్‌కి రావడం, శానిటైజింగ్‌ చేసుకోవడం, చాలా జాగ్రత్తలతో మేకప్‌ వేసుకోవడం, సెట్‌లో చాలా పరిమితంగా క్రూ ఉండటం, ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడం వంటివి కనిపిస్తున్నాయి. 

ఈ సందర్భంగా నాగ్‌ చెబుతూ, ఇది `వైల్డ్ డాగ్‌` కోసం ఓ సరదా షూటింగ్‌. అలాగే ఒక్క రోజు తర్వాత బిగ్‌ బాస్‌ 4 షూటింగ్‌ చేయనున్నాం. లైట్‌.. కెమెరా.. యాక్షన్‌.. అన్ని రకాల జాగ్రత్తలతో వైల్డ్ డాగ్‌ షూటింగ్‌ ప్రారంభమైంది` అని తెలిపారు. ఇందులో యూట్యూబ్‌ లింక్‌ని షేర్‌ చేశారు. ఇందులో కింగ్‌ పాత్‌ బ్రేక్‌ చేసి మిగతా వారికి దారిచూపారని పేర్కొనడం విశేషం. సాల్మోన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `వైల్డ్ డాగ్‌`లో నాగ్‌ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన లుక్‌ ఆకట్టుకుంది.